పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మధుర ఘట్టం. ఇది కేవలం ఇద్దరి మానసిక, శారీరక కలయిక మాత్రమే కాకుండా, రెండు కుటుంబాల మద్దతుతో సాగే జీవిత ప్రయాణం. కాలాలు మారినా, యుగాలు మారినా, వివాహ బంధానికి ఉన్న గౌరవం మాత్రం తగ్గలేదు. కానీ తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, భోపాల్ ప్రాంతాల్లో పెళ్లి అనే పదం వినగానే యువకులు వణికిపోతున్న పరిస్థితి ఏర్పడింది.

పెళ్లి భయానికి కారణం: రఘువంశి రాజా హత్య కేసు
నేటి సమాజంలో అమ్మాయిల కొరత, పెరిగిన కల్చరల్ గ్యాప్, నమ్మకాల పతనం వంటి అంశాలు పెళ్లిళ్లపై ప్రభావం చూపిస్తున్నాయి. అయినా కూడా ఇండోర్, భోపాల్ వంటి అభివృద్ధి చెందిన నగరాల్లో యువకులు పెళ్లికి భయపడే స్థాయికి చేరడం ఆందోళనకరం. ఇందులో ప్రధానంగా ఒక సంఘటన కీలకంగా నిలిచింది. ఇండోర్‌కు చెందిన యువకుడు రఘువంశి రాజా తన భార్య సోనంతో హనీమూన్‌కు మేఘాలయకు వెళ్లగా, ఆమె ప్రియుడి సహకారంతో కిరాయి హంతకులతో రాజాను హత్య చేయించింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. భోపాల్ ప్రాంతానికి చెందిన సోనం చేసిన ఈ క్రూరత వల్ల అక్కడి యువకుల మనస్తత్వంలో గంభీరమైన మార్పు వచ్చిందంటున్నారు సైకాలజిస్టులు.
“స్పౌజ్ క్రైమ్ సిండ్రోమ్”, వివాహాలపై ప్రభావం
ఈ ఘటన తర్వాత నుండి ఇండోర్, భోపాల్ యువకులు వివాహ విషయాల్లో అప్రమత్తంగా మారారు. పెళ్లి కుదిరిన తర్వాత కూడా భార్యల ప్రవర్తనను అనుసంధానంగా పరిశీలిస్తున్నారు. వధువుల సోషల్ మీడియా ఖాతాలను చెక్ చేస్తున్నారు. గత సంబంధాలు ఉన్నాయా? పాత ప్రేమలు ఏమైనా ఉన్నాయా? అన్నదానిపై డిటెక్టివ్‌ల సాయంతో విచారణ చేయిస్తున్నారు. ఈ పరిస్థితిని “స్పౌజ్ క్రైమ్ సిండ్రోమ్”గా గుర్తిస్తున్నారు మానసిక నిపుణులు. ఇది భవిష్యత్ వైవాహిక జీవితం పట్ల తీవ్ర అనిశ్చితిని కలిగిస్తోంది.
ఇప్పటికే కొందరు యువకులు తమకు కుదిరిన సంబంధాలను రద్దు చేసుకుంటున్నారు. భయంతో, అనుమానంతో పెళ్లి జీవితంలోకి అడుగుపెడితే అది సంతోషాన్ని కాక బాధనే కలిగిస్తుందని భావిస్తున్నారు. ఓవైపు పెళ్లి కావడం లేదు, ఇంకోవైపు పెళ్లి అంటేనే భయం.. ఇవే నేటి యువత ఎదుర్కొంటున్న విపరీత పరిస్థితులు.
నమ్మకం పునరుద్ధరణ ఆవశ్యకత
ఈ పరిస్థితి కేవలం ఇండోర్, భోపాల్‌కే పరిమితమై ఉండకపోవచ్చు. దేశంలో ఇటువంటి సంఘటనలు మరిన్ని చోటు చేసుకుంటే, యువత పెళ్లిని దూరంగా ఉంచే అవకాశం ఉంది. నమ్మకాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఈ తరుణంలో ఉంది. సంబంధాల మధ్య బలమైన నమ్మక బంధం ఏర్పడకపోతే, పెళ్లి అనే శుభతంతు కూడా బాధాకర అనుభవంగా మారవచ్చు. అందుకే నేటి సమాజంలో సంబంధాలకు విలువ ఇచ్చే దిశగా ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.































