కరోనా రోగుల్లో చర్మ సమస్యలు.. ప్రాణాలకే అపాయమంట..!గత కొద్ది నెలలుగా యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి తిరిగి మరోసారి తీవ్ర రూపం దాలుస్తుంది. వాతావరణంలో మార్పులు సంభవించడం వల్ల ఈ వ్యాధి తీవ్రత అధికమవుతుంది. రోజు రోజుకి కేసులు పెరుగుతుండటంతో ఎంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలియజేస్తున్నారు. అయితే ఇప్పటికే కరోనా బారిన పడ్డ వారిలో పలు రకాల కొత్త సమస్యలు తలెత్తుతున్నాయని తాజా పరిశోధనలు వెల్లడైంది.

కరోనా మహమ్మారి నుంచి కొంతమంది పూర్తిగా విముక్తి పొందినప్పటికీ, మరికొంతమంది అనేక సమస్యలతో సతమతమవుతున్నారని తాజా అధ్యయనం పరిశోధకులు వెల్లడించారు. కరోనా సోకిన వారు అధికంగా చర్మ వ్యాధుల బారిన పడినట్లుగా యూరోపియన్ అకాడమికి చెందిన చర్మ వ్యాధి నిపుణులు ఇటీవల యుఎస్ఏ లో జరిగిన 29వ కాంగ్రెస్ సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.
ఈ పరిశోధనలో భాగంగా కరోనా సోకిన దాదాపు 1000 మందికి పైగా పరిశోధనలు నిర్వహించారు. ఈ పరిశోధనలో భాగంగా వీరి చర్మంపై ఏర్పడే పొలుసులు, పొక్కులు ఇతర సమస్యలతో బాధ పడే వారిని సైతం ఈ అధ్యయనంలో పరీక్షించారు. వీరిలో చాలా మందికి కాళ్లు,చేతులు ఎరుపెక్కి వాపు రావడం గుర్తించారు. వీరిని 15 రోజుల పాటు పరిశీలించి అధ్యయనం చేశారు. ఈ వైరస్ నుంచి పూర్తిగా కోలుకోని వాళ్ళు కోవిడ్ వల్ల వచ్చే చర్మ వ్యాధులతో దాదాపు 60 రోజుల వరకు బాధపడినట్లు ఈ పరిశోధనల్లో వెల్లడైంది.
ఈ పరిశోధనలో భాగంగా గతంలో ఎప్పుడు రాని కొత్త చర్మ సమస్యలను గుర్తించామని శాస్త్రవేత్తలు తెలియజేశారు. ఈ వైరస్ వల్ల అవయవ వ్యవస్థ పై ఏర్పడి దీర్ఘకాలిక సమస్యలను తెలుసుకోవడానికి ఈ అధ్యయనం ఎంతగానో ఉపయోగపడి, కోవిడ్ బారిన పడిన వారికి చర్మ సమస్యలకు రాకుండా ముందుగానే చికిత్స చేయడానికి వీలవుతుందని పరిశోధకులు తెలిపారు. వీలైనంత వరకు తగు జాగ్రత్తలు పాటించడం ద్వారా ఇలాంటి సమస్యల బారినపడకుండా ఉండవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.



































