జల కాలుష్యం కారణంగా హైదరాబాద్ లోని ఏ చెరువులో కూడా వినాయకుడి విగ్రహాలను నిమజ్జనం చేయవద్దని ఇటీవల హైకోర్టు ప్రభుత్వానికి సూచించిన విషయం తెలిసిందే. అయితే మూడో రోజు వరకు హుస్సేన్ సాగర్ లో విగ్రహాలను నిమజ్జనం చేసిన నగర వాసులు.. నాలుగో రోజు నుంచి చేయడానికి వీళ్లేదని ప్రభుత్వం తెలిపింది.తాజాగా దీనిపై అడ్డంకులు తొలగిపోయాయి. హుస్సేన్‌సాగర్ తో సహా అన్ని చెరువుల్లో వినాయక విగ్రహాలు నిమజ్జనం చేసుకోవడానికి సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

తెలంగాణ హైకోర్టు హైదరాబాద్ లో ఏ చెరువులో కూడా నిమజ్జనం చేయవద్దని ఉత్తర్వులను జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై జీహెచ్ ఎంసీ ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. దానిపై సుప్రింకోర్టు న్యాయస్థానం విచారణ చేపట్టింది. సుప్రీంకోర్డు ప్రధాన న్యాయమూర్తి ఎనవీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమాకోహ్లిలతో కూడిన ధర్మాసనం వాదనలు విన్నది.
హైకోర్టు వెలువరించిన ఈ ఉత్తర్వులు విగ్రహాన్ని నిలిపిన మూడు రోజుల తర్వాత ఉండటంతో.. ఈ సంవత్సరం అందులో కొన్ని మినహాయింపులు కోరుతున్నట్లు జీహెచ్ఎంసీ ధర్మాసనానికి విన్నవించింది. కోర్టు ఉత్తర్వుల్లోని చాలా అంశాలకు తాము కట్టుబడి ఉంటామని, ఒకట్రెండు అంశాలను మాత్రం తక్షణం అమలు చేయలేమని పేర్కొంది.
అయితే దీనిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ.. హుస్సేన్‌సాగర్‌లో గణేష్ విగ్రహాలు నిమజ్జనం చేసుకోవచ్చని తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పు అనేది ఈ ఒక్క సంవత్సరం మాత్రమే అని.. వచ్చే సంవత్సరంలో ఎట్టి పరిస్థితుల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు వీలులేదని కూడా పేర్కొంది. దీంతో నగరవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.































