దేశవ్యాప్తంగా కరోనా కేసులు అధికమైన నేపథ్యంలో కరోనా వైరస్ ఎంతోమంది పచ్చని కాపురాల్లో చిచ్చు పెట్టిందని చెప్పవచ్చు.వైరస్ బారిన పడి కొందరు చనిపోతే వారి మరణాన్ని తట్టుకోలేక మరి కొందరు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే ఇలాంటి ఘటన తమిళనాడు రాష్ట్రంలో ఒకటి చోటు చేసుకుంది.భర్త కరోనాతో మరణించాడని కుంగిపోయిన భార్య తన పిల్లలకు విషమిచ్చి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

మాంగాడుకు చెందిన భాస్కర్, నిత్య దంపతులు నివసించేవారు. వీరికి కుమార్తె మహతి, కుమారుడు యాదవ్ కృష్ణ అనే పిల్లలు ఉన్నారు. ఎంతో ఆనందంగా సాగిపోతున్న వీరి కుటుంబంలో కరోనా చిచ్చు పెట్టింది. గత నెల రెండవ తేదీన భాస్కర్ కరోనా బారిన పడగా అతడు చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 9వ తేదీన మృతి చెందాడు.
తన భర్త భాస్కర్ మృతి చెందడంతో నిత్య శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ క్రమంలోనే తన ఇద్దరు పిల్లలను తీసుకొని ఈరోడ్‌లో ఉన్నటువంటి తన పుట్టింటికి వెళ్ళింది.తన పుట్టింటికి వెళ్ళిన నిత్య తన భర్త ఇక లేడు అనే విషయాన్ని జీర్ణించుకోలేక పోయింది.తన భర్త లేని జీవితం తనకు అవసరం లేదని భావించిన నిత్య కఠినమైన నిర్ణయాన్ని తీసుకుంది.
ఈ క్రమంలోనే గురువారం మధ్యాహ్నం భోజనంలో తన పిల్లలకు విషం కలిపి తినిపించి తాను కూడా గదిలోకి వెళ్లి ఆత్మ హత్యకు పాల్పడింది. ఆలస్యంగా గమనించిన తన తండ్రి పార్థసారధి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారి ముగ్గురి శవాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసును దర్యాప్తు చేస్తున్నారు.































