టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న వెంకట్.. ప్రస్తుతం హైదరాబాద్ బోడుప్పల్‌లోని ఆర్బీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండు కిడ్నీలు పూర్తిగా పనిచేయకపోవడంతో వెంటిలేటర్‌పై ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది. దీంతో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ తప్పనిసరిగా మారింది. అయితే, ఆపరేషన్‌కు అవసరమైన ఖర్చును భరించలేని పరిస్థితిలో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు.

సినీ పరిశ్రమ నుంచి ఎదురైన నిర్లక్ష్యంపై పలుచోట్ల విమర్శలు వ్యక్తమవుతున్న వేళ, తొలుత ప్రభాస్ టీమ్ నుంచి ఫోన్ వచ్చిందని, ఆయన ట్రీట్మెంట్ ఖర్చు భరిస్తారని వార్తలు వెలువడ్డాయి. కానీ తర్వాత ఆ కాల్ ఫేక్ కాల్‌గా మారిందని వెంకట్ కుమార్తె స్రవంతి వెల్లడించారు. దీంతో సినీ పరిశ్రమపై విమర్శలు ముదిరాయి. అంతకుముందు చిరంజీవి సహాయానికి ముందుకు వచ్చినా, స్నేహితుడి మోసం వల్ల ఆ సహాయం ముందుకు సాగలేదన్న వివరణ కూడా ఆమె ఇచ్చింది.
ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం మానవత్వంతో స్పందించింది. మంత్రి వాకిటి శ్రీహరి స్వయంగా ఆసుపత్రికి వెళ్లి వెంకట్‌ను పరామర్శించి వచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, వెంకట్‌కు అవసరమైన మొత్తం చికిత్సా ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని ప్రకటించారు. అంతేకాదు, తక్షణ ఖర్చుల నిమిత్తం రూ. లక్షను వెంకట్ కుటుంబానికి అందించారు.
ఈ పరిణామంతో వెంకట్ కుటుంబానికి కొంత ఊరట లభించింది. ప్రస్తుతం కిడ్నీ డోనర్ కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. అప్పటి వరకు డయాలసిస్‌తో వెంకట్ చికిత్స కొనసాగనుంది. ఈ ఘటనతో ప్రభుత్వ హస్తం వల్ల ఒక కళాకారుడి ప్రాణాలు కాపాడే పరిస్థితి ఏర్పడడం పట్ల సినీ అభిమానులు, నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.































