నయీండైరీ చిత్రంలో గాయని బెల్లి లలిత క్యారెక్టర్ అభ్యంతరకరంగా ఉందంటూ తెలంగాణ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు లలిత కుమారుడు సూర్య ప్రకాష్. మావోయిస్ట్ నుంచి గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగిన నయీం రాష్ట్రంలో ఎంతటి సంచలనాలను సృష్టించారో తెలిసిందే. 1999లో బెల్లి లలిత దారుణ హత్యకు గురయ్యారు. కాగా అప్పట్లో ఆమెని నయీం హత్య చేయించాడని కుటుంబసభ్యులు ఆరోపించారు.

పోలీసులు పెంచి పోషించిన గ్యాంగ్‌స్టర్ నయీం ఆగడాలు ఎక్కువైపోతున్న నేపథ్యంలో ఐదేళ్ల క్రితం ఆయన్ని పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. తాజాగా అతడి డైరీ ఆధారంగా ఇవాళ ‘నయూం డైరీ’ చిత్రం రిలీజ్ అయింది. ఈ చిత్రంలో బెల్లి లలిత క్యారెక్టర్ అయిన ‘లత’ ను నయీం లిప్ కిస్ చేసే దృశ్యాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు ఆమె కుటుంబ సభ్యులు.
దీంతో హైకోర్టు చిత్రం డైరెక్టర్, ప్రొడ్యూసర్ కు నోటీసులు ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది హైకోర్టు. అప్పటి వరకు ఈ సినిమాను ప్రదర్శించడానికి వీళ్లేదంటూ తెలియజేసింది. ఇక దీనిపై చిత్ర నిర్మాత వరదరాజు బెల్లి లలిత కుటుంబానికి క్షమాపణ చెప్పారు.
ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. సినిమాలో ఒక మహిళ పాత్రను చిత్రించి ఆమె అభిమానుల్ని బాధపెట్టినట్లు తమ దృష్టికి వచ్చిందని.. నిజ జీవితంలో అమరులైన ఆ మహిళ కుటుంబసభ్యులకు తాము క్షమాపణ చెబుతున్నామని.. అటువంటి అసభ్యకర సన్నివేశాలను ఆ చిత్రం నుంచి తొలగిస్తామని అతడు తెలిపాడు. వారి మనోభావాల్ని గాయపరిచినందుకు మేము భేషరతుగా క్షమాపణ చెప్తున్నామన్నారు. ఇక ఈ సినిమాలో నయీం పాత్ర పోషించిన వశిష్ఠ సింహ నటన సినిమాకు హైలైట్‌గా నిలిచింది. ఈ సినిమాకు రచన, డైరెక్టర్ గా దాము బాలాజీ పని చేయగా.. అరుణ్ కుమార్ సంగీత దర్శకుడిగా పని చేశాడు.
































