న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న నీటి పంపకాలు, ప్రాజెక్టుల వివాదాలపై ఢిల్లీ వేదికగా కీలక సమావేశం జరిగింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి (తెలంగాణ), నిమ్మల రామానాయుడు (ఆంధ్రప్రదేశ్), ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు (సీఎస్), నీటిపారుదల శాఖ కార్యదర్శులు కూడా హాజరయ్యారు. దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ చర్చలు ఉత్కంఠ రేపాయి.

సమావేశ ఎజెండాలో కీలక అంశాలు:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి బనకచర్ల ప్రాజెక్టును సింగిల్ పాయింట్ ఎజెండాగా ప్రతిపాదించింది. మరోవైపు, తెలంగాణ ప్రభుత్వం 13 అంశాలను ఎజెండాలో చేర్చింది. వీటిలో పాలమూరు-రంగారెడ్డి, డిండి, సమ్మక్క సాగర్, ప్రాణహిత-చేవెళ్ల సహా పలు కీలక ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని ప్రతిపాదనల్లో పేర్కొంది.
నిమ్మల రామానాయుడు ఏమన్నారంటే..
సమావేశం అనంతరం ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ, గోదావరి, కృష్ణా నదీ జలాలపై చర్చలు చాలా మంచి వాతావరణంలో జరిగాయని, ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఆహ్లాదకరంగా చర్చలు సాగాయని తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం కమిటీ వేస్తామని కేంద్రం తెలిపిందన్నారు.
ముఖ్యంగా, శ్రీశైలం ప్రాజెక్టును కాపాడుకోవాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. కృష్ణా నది బోర్డు అమరావతిలో, గోదావరి బోర్డు తెలంగాణలో ఉండేలా నిర్ణయం తీసుకున్నామని రామానాయుడు వెల్లడించారు.
జులై 21 (సోమవారం) లోగా ఈ కమిటీని ఏర్పాటు చేస్తారని, పోలవరం-బనకచర్ల ప్రాజెక్టులపై టెక్నికల్, అడ్మినిస్ట్రేటివ్ సభ్యులతో కమిటీ వేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. “రెండు రాష్ట్రాలకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకున్నాం. రెండు రాష్ట్రాలు అయినా ప్రజలు ఒక్కటే, అందరికీ న్యాయం జరగాలి” అని నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.
నీటి వివాదాల నేపథ్యం
గత కొన్నేళ్లుగా ప్రాజెక్టుల విషయంలో ఏపీ, తెలంగాణ మధ్య “వాటర్ వార్” కొనసాగుతోంది. ముఖ్యంగా, గోదావరిపై ఏపీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్ట్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ప్రాజెక్టే తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ప్రధాన ఎజెండాగా మారింది. ఇలాంటి సమయంలోనే బనకచర్లపై ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపడం మరింత ఉద్రిక్తతకు దారితీసింది. ఈ వివాదాల నేపథ్యంలోనే కేంద్రం జోక్యం చేసుకుని ఢిల్లీలో ఇద్దరు ముఖ్యమంత్రులతో ఈ కీలక సమావేశాన్ని నిర్వహించింది. ఈ భేటీతో నీటి వివాదాలకు పరిష్కారం లభిస్తుందని ఇరు రాష్ట్రాల ప్రజలు ఆశిస్తున్నారు.
ఇరు రాష్ట్రాల జల సంబంధిత అంశాలపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి శ్రీ సీఆర్ పాటిల్ అధ్యక్షతన ఢిల్లీ లో జరిగిన సమావేశానికి ఏపీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి హాజరయ్యారు. (1/2) pic.twitter.com/82GtofL4uQ
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) July 16, 2025


































