Content: కొన్ని ఘటనలు చూస్తుంటే హృదయాన్ని కలచి వేస్తాయి. దేవుడు ఇంత అన్యాయం చేశాడేంట్రా అని అనుకుంటాం. కరోనా మహమ్మారి కాలంలో ఇలాంటి ఘటనలు చూస్తూ వచ్చాం. తాజాగా జరిగిన ఓ ఘటన చూసిన ప్రతీ ఒక్కరూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఈ ఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ముధోల్ మండలంలోని ఎడ్‌బిడ్ గ్రామానికి చెందిన రోషిని అనే మహిళ అనారోగ్యంతో మృతి చెందింది. కొన్ని రోజుల క్రితం అతడి భర్త మరణించాడు. వాళ్లకు ఐదు సంవత్సరాల చిన్నారి కూడా ఉంది. ఈ విషాద ఘటనతో ఆ బాలిక అనాథగా మారిపోయింది.
తల్లి శవం పక్కన కూర్చున్న ఆ చిన్నారి రోధనలు మిన్నంటాయి. తల్లి మృతదేహం పక్కన అమాయకంగా కూర్చున్న చిన్నారిని చూసి గ్రామస్తులందరూ కంటనీరు తెచ్చుకుంటున్నారు. కనీసం అంత్యక్రియలు చేయడానికి కూడా డబ్బలు లేని నిస్సాయస్థితిలో ఉన్న ఆ బాలికను చూసిన కొందరు కరిగిపోయారు. స్థానికులు తలో చేయి వేసుకొని.. అంత్యక్రియలకు సాయం చేశారు.
అంతే కాకుండా.. వాట్సాప్ గ్రూప్ లో ఈ విషయాన్ని షేర్ కూడా చేశారు. దీనికి భైంసా సేవా టీమ్ సభ్యులు స్పందించి దాదాపు రూ.95 వేలు ఆర్థిక సహాయాన్ని అందించారు. వాళ్ల పేరు తరఫున గూగుల్ పే చేశారు. దీంతో ఆ టీమ్ సభ్యులను గ్రామస్తులు అభినందించారు. వచ్చిన డబ్బులతో ఆమె అంత్యక్రియలను నిర్వహించారు స్థానికులు.





























