గత కొన్ని నెలల నుంచి శరవేగంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. పలు రంగాలపై వైరస్ తీవ్ర ప్రభావం చూపింది. వైరస్ గురించి పరిశోధనలు చేసే కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తూ ప్రజలను మరింత భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో రెండోసారి కరోనా వైరస్ సోకితే ప్రాణాలకే ప్రమాదమని వెల్లడైంది.

మొదటిసారి కరోనా వైరస్ సోకిన వారిలో లక్షణాలు కనిపించినా కనిపించకపోయినా రెండోసారి కరోనా సోకిన వారిలో మాత్రం తీవ్ర కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. యూనివర్సిటీ ఆఫ్ నెవెడాకు చెందిన శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి ఈ ఫలితాలను వెల్లడించారు. లాన్సెట్ పత్రికలో రెండోసారి కరోనా సోకే వారిలో కలిగే సమస్యల గురించి కథనాలు ప్రచురితమయ్యాయి.

అమెరికాలో ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేని ఒక వ్యక్తికి 50 రోజుల క్రితం కరోనా నిర్ధారణ అయింది. తొలిసారి కరోనా సోకిన సమయంలో ఆ వ్యక్తి చికిత్స తీసుకుని వైరస్ నుంచి కోలుకున్నాడు. అయితే కరోనా సోకిన రోజు నుంచి 50 రోజుల్లో అదే వ్యక్తికి కరోనా నిర్ధారణ కావడంతో పాటు తొలిసారితో పోల్చి చూస్తే రెండోసారి వ్యాధి లక్షణాలు తీవ్రంగా కనిపించాయి. రెండోసారి కరోనా సోకిన వాళ్లకు కృత్రిమంగా ఆక్సిజన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని వెల్లడించారు.

మరోవైపు కరోనా నుంచి కోలుకున్న వారిలో యాంటీబాడీలు ఎంతకాలం ఉంటాయనే ప్రశ్నకు ఖచ్చితమైన సమాచారం ఎవరూ చెప్పలేకపోతున్నారు. అయితే కరోనా రోగులు కోలుకున్న కొన్ని వారాల్లోనే వైరస్ బారిన పడుతున్నారని.. యాంటీబాడీలు శరీరంలో ఎంతకాలం ఉంటాయో ఖచ్చితమైన సమాచారం లేదని వైద్యులు, శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. ఐ.సీ.ఎం.ఆర్ చీఫ్ బలరాం భార్గ కరోనా యాంటీబాడీల గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ దగ్గర సైతం ఖచ్చితమైన సమాచారం లేదని వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here