వంటల్లో రుచిని పెంచే ముఖ్యమైన పదార్థాల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి. కూరలు, ఫ్రైలు, బిర్యానీలు వంటి ఎన్నో వంటకాల్లో ఇది తప్పనిసరిగా వాడుతుంటారు. అయితే ప్రతిరోజూ తాజాగా దంచుకోవడం కష్టంగా అనిపించడంతో చాలామంది ఒకేసారి ఎక్కువగా తయారు చేసి నిల్వ ఉంచుతుంటారు. కానీ సరైన పద్ధతిలో స్టోర్ చేయకపోతే కొద్ది రోజుల్లోనే వాసన మారిపోవడం, రంగు మారడం లేదా పేస్ట్ పాడవడం జరుగుతుంది.

వంట నిపుణుల సూచనల ప్రకారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే మొదట పదార్థాల ఎంపిక చాలా ముఖ్యం. గట్టిగా ఉన్న వెల్లుల్లి రెబ్బలు, తాజా అల్లం తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. అల్లాన్ని శుభ్రంగా కడిగి తొక్క పూర్తిగా తీసేయాలి. అలాగే వెల్లుల్లిని కూడా శుభ్రంగా వేరు చేసి సిద్ధం చేసుకోవాలి.
కడిగిన తర్వాత అల్లం, వెల్లుల్లిలో తడి అసలు ఉండకూడదు. అందుకే వాటిని పొడి గుడ్డపై కొంతసేపు ఆరబెట్టాలని సూచిస్తున్నారు. తేమ ఎక్కువగా ఉంటే పేస్ట్ త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. మిక్సీలో వేసే ముందు కూడా చేతికి తడి తగలకుండా చూసుకోవడం అవసరం.
పేస్ట్ తయారు చేసే సమయంలో నీళ్లు పోయకపోవడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. అవసరమైనంత ఉప్పు, కొద్దిగా పసుపు, కొంత నూనె వేసి గ్రైండ్ చేస్తే పేస్ట్ రుచిగా ఉండటమే కాకుండా ఎక్కువకాలం నిల్వ ఉంటుంది. నూనె వల్ల పేస్ట్ గట్టిపడకుండా కూడా ఉంటుంది.
నిల్వ విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు అవసరం. ప్లాస్టిక్ డబ్బాల కంటే గాజు సీసాలు ఉపయోగించడం మంచిదని సూచిస్తున్నారు. గాజు సీసాలను ముందుగా వేడి నీటితో శుభ్రపరచి పూర్తిగా ఆరబెట్టి వాడితే బూజు వచ్చే అవకాశం తగ్గుతుంది. అలాగే పేస్ట్ తీసేటప్పుడు ఎప్పుడూ పొడి స్పూన్ మాత్రమే వాడాలి.
కొంతమంది ఈ పేస్ట్‌ను చిన్న చిన్న ఐస్ క్యూబ్ ట్రేలలో వేసి ఫ్రీజ్‌లో నిల్వ చేస్తుంటారు. అవసరమైనప్పుడు ఒక్క క్యూబ్ తీసుకుని వాడటం వల్ల పేస్ట్ మిగతాది తాజాగా ఉంటుంది. సరైన పద్ధతులు పాటిస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ నెలల తరబడి మంచి వాసన, రుచితో నిల్వ ఉంటుందని చెబుతున్నారు.



























