గత కొన్ని నెలల నుంచి హనుమంతుడి జన్మ స్థానం పై వివిధ రకాల వార్తలు వినిపించాయి. అయితే హనుమంతుని జన్మ స్థానం అంజనాద్రి అని తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అధికారిక ప్రకటన చేశారు. తిరుపతి సప్తగిరుల్లో అంజనాద్రే ఆంజనేయుడి జన్మస్థానం అని,అంజనాద్రిలోని జాపాలీ తీర్థంలో హనుమంతుడు జన్మించినట్లు వెల్లడించింది.

ఈ విషయాన్ని తిరుమలలోని నాదనీరాజనం వేదికగా జాతీయ సంస్కృత వర్సిటీ వీసీ ఆచార్య మురళీధర శర్మ ప్రకటించారు. ఆంజనేయుడు జన్మస్థానం అన్వేషణకు తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సభ్యులు పలుమార్లు సమావేశమై లోతుగా పరిశీలించి సరైన ఆధారాలను సేకరించి ఆంజనేయుడి జన్మస్థానం అంజనాద్రే అని ప్రకటన చేసింది.
శాసన, భౌగోళిక, పౌరాణిక, వాజ్ఞ్మయ ప్రమాణాలతో ఆధారాలు సేకరించాము. అదేవిధంగా వెంకటాచల మహత్వాన్ని పౌరాణిక ఆధారంగా తీసుకున్నాము. వేంకటాచలానికి అంజనాద్రితో పాటు 20 రకాల పేర్లు ఉన్నాయి. అయితే త్రేతాయుగంలో దీనిని అంజనాద్రిగా పిలువబడింది. అంజనాదేవికి తపస్సు కారణంగా ఈ పర్వతంపై ఆంజనేయుడు జన్మించాడు.సూర్యబింబం కోసం వేంకటగిరి నుంచే హనుమ ఎగిరాడు. 12 పురాణాలు ఆంజనేయుడు తిరుమల కొండల్లోనే పుట్టాడని తెలియజేస్తున్నాయి.
హంపి, విజయనగరం, గుజరాత్, మహారాష్ట్ర, ఇవేవీ ఆంజనేయుడు జన్మస్థలం కాదని, తితిదే అధికారులు స్పష్టం చేశారు.హనుమ జన్మస్థానంపై అన్వేషణకు ఏర్పాటు చేసిన కమిటీలో మురళీధర శర్మతో పాటు ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సన్నిధానం సుదర్శన శర్మ, ఆచార్య రాణి సదాశివమూర్తి, ఆచార్య జానమద్ది రామకృష్ణ, ఆచార్య శంకరనారాయణ, ఇస్రో శాస్త్రవేత్త రేమెళ్ల మూర్తి తదితరులు ఉన్నారు






























