ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలోని కొందరి బ్యాంక్ ఖాతాలలో వేల రూపాయల నగదు జమవుతోంది. ఎవరు వేస్తున్నారో ఎందుకు వేస్తున్నారో తెలీదు కానీ భారీ మొత్తంలో నగదు జమవుతూ ఉండటంతో అక్కడి ప్రజలు పండుగ చేసుకుంటున్నారు. విజయనగరం జిల్లాలోని సాలూరు మండలం శివరామపురం గ్రామానికి చెందిన 200 మంది బ్యాంకు ఖాతాలలో 13,000 రూపాయల నుంచి 16,000 రూపాయల వరకు నగదు జమైంది.

ఆ నగదు ఎక్కడి నుంచి జమైందో ఎవరు జమ చేశారో తెలియదని తమకు సమాచారం అందలేదని అధికారులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారులు దర్యాప్తు జరిపితే మాత్రమే ఆ నగదు ఎవరు జమ చేశారో ఎక్కడి నుంచి జమైందో తెలిసే అవకాశం ఉంటుంది. అయితే ఎవరి ఖాతాల్లో డబ్బులు జమయ్యాయో వాళ్లు డబ్బులు జమైనట్లు ఇతరులకు చెప్పడానికి ఇష్టపడటం లేదు.
డబ్బు జమైనట్లు చెబితే వెనక్కు తీసుకుంటారని కొందరు భయపడుతున్నారు. మరి కొందరు మాత్రం ఆ నగదు ఏదైనా ప్రభుత్వ పథకానికి సంబంధించిన నగదు అయ్యి ఉండవచ్చని వెల్లడిస్తున్నారు. గ్రామంలో పొలం లేని వారి ఖాతాల్లో కూడా నగదు జమ కావడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖాతాదారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడం వల్ల నగదు జమకు సంబంధించి పూర్తి వివరాలు తెలియడం లేదు.
బ్యాంక్ అధికారులు డబ్బులు జమ కావడానికి గల కారణాన్ని పరిశీలిస్తామని.. ప్రస్తుతం బ్యాంక్ అకౌంట్ నంబర్ కు ఆధార్ నంబర్ లింక్ కావడంతో డబ్బులు తప్పుగా జమయ్యే అవకాశం ఉండదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ డబ్బులు పొరపాటున బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయా..? లేక ఎవరైనా కావాలని బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారా..? తెలియాల్సి ఉంది.































