ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల వేడి రాజుకుంటుంది. ఈ క్రమంలోనే ఈ ఎన్నికల విషయమై రోజురోజుకు మా సభ్యుల మధ్య వివాదం ముదురుతోంది. మా అధ్యక్ష పదవి కోసం భారీపోటీ ఉండటంతో ఇందులో నటుడు ప్రకాష్ రాజ్ కూడా పోటీకి దిగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికి ప్రకాష్ రాజ్ తన ప్యానెల్ సభ్యులని ప్రకటించి అందరికన్నా ముందు వరుసలో ఉన్నారు.

ఈ క్రమంలోనే మొన్నటి వరకు ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యుడిగా అతనికి మద్దతు తెలిపిన బండ్లగణేష్ చివరి నిమిషంలో ప్లేటు ఫిరాయించారు. ప్రకాష్ రాజు ప్యానల్ నుంచి జీవిత రాజశేఖర్ పోటీకి దిగడంతో బండ్ల గణేష్ ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి బయటకు వచ్చి జీవిత రాజశేఖర్ పై పోటీకి దిగుతున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో ప్రకాష్ రాజ్ శనివారం ప్యానెల్ సభ్యులతో సమావేశం అయ్యి అందరినీ విందుకు ఆహ్వానించారు.
ఈ క్రమంలోనే “మా” విందుకు బండ్ల గణేష్ ని కూడా ఆహ్వానించగా బండ్ల గణేష్ మా విందు ఆహ్వానానికి అభ్యంతరం వ్యక్తం చేశారు. మా కళాకారులు అందరిని ఒక చోటచేర్చి వారి ప్రాణాలతో చెలగాటమాడొద్దని, ఒకవేళ ఎన్నికల ప్రచారం చేయాల్సి ఉంటే పర్సనల్ గా ఫోన్ చేసి మీ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తే సరిపోతుందని బండ్లగణేష్ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని విడుదల చేశారు.
బండ్ల గణేష్ వ్యాఖ్యలకు ప్రకాష్ రాజ్ స్పందిస్తూ భారీ కౌంటర్ ఇచ్చారు. విందు ఏర్పాటు చేసిన అనంతరం ప్రకాష్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ… బండ్ల గణేష్ వ్యాఖ్యలను ఖండించారు. ఎన్నికల అంటే పెద్ద ఎత్తున ప్రచారం, మీటింగ్ పెట్టుకోవడం అంత పెద్ద ప్రాసెస్. కరోనా నిబంధనలు పాటిస్తూ ఇప్పటి వరకు రాజకీయ ఎన్నికలు, వివాహ వేడుకలు, శుభకార్యాలు ఎన్నో జరిగాయి. ఆ విధంగానే మేము కూడా కరోనా నిబంధనలను పాటిస్తూ విందు కార్యక్రమం ఏర్పాటు చేశామని..ఈ విందు పై బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఎంతో హాస్యాస్పదంగా ఉన్నాయంటూ బండ్ల గణేష్ వ్యాఖ్యలను ప్రకాష్ రాజ్ తీవ్రంగా ఖండించారు.
































