చికెన్ అంటే చాలా మందికి ఇష్టమైన ఆహారం. ముఖ్యంగా ఫ్రైడ్, గ్రిల్డ్ వంటకాలలో కోడి చర్మంతో తినడం కొందరికి మరింత రుచిగా అనిపిస్తుంది. అయితే ఈ అలవాటు ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోవడం అవసరం. వైద్య నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం, చికెన్ చర్మంలో ఉండే కొవ్వు శరీరానికి అవసరమైనది కాదని స్పష్టం చేస్తున్నారు.

కోడి చర్మంలో సంతృప్త కొవ్వు (సాచ్యురేటెడ్ ఫ్యాట్) అధికంగా ఉంటుంది. ఇది రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను పెంచే అవకాశం కల్పిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయులు పెరగడం వల్ల రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి రక్తప్రసరణ మందగిస్తుంది. దీని ఫలితంగా గుండెపోటు, పక్షవాతం వంటి సమస్యల ముప్పు పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు లేదా బీపీ, కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు చికెన్ స్కిన్‌కు దూరంగా ఉండడం మంచిదని సూచిస్తున్నారు.
ఇక బరువు విషయంలో కూడా చికెన్ చర్మం ప్రభావం గణనీయంగానే ఉంటుంది. దీపంగా వేయించిన చికెన్ చర్మం అధిక నూనెను పీల్చుకుని మరింత క్యాలరీలను అందిస్తుంది. తరచూ ఇలా తినడం వల్ల శరీర బరువు పెరగడమే కాకుండా, ఊబకాయం సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. దీని కారణంగా టైప్-2 డయాబెటిస్, థైరాయిడ్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.
అయితే చికెన్ చర్మం పూర్తిగా తినకూడదనే నియమం లేదు. చాలా అరుదుగా, మితంగా తీసుకుంటే పెద్దగా సమస్య ఉండదని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే వారానికి ఒకసారి లేదా తరచూ తినే అలవాటు మాత్రం తగ్గించుకోవడం మంచిది. పిల్లలు, వృద్ధులు, అలాగే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు చికెన్ స్కిన్‌కు దూరంగా ఉండడం ఉత్తమం.
మొత్తానికి, రుచికంటే ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడం అవసరం. చికెన్ వండే సమయంలో చర్మాన్ని తొలగించడం ద్వారా అధిక కొవ్వు, క్యాలరీలను తగ్గించుకోవచ్చు. ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు పాటించడం ద్వారా దీర్ఘకాలంలో మంచి ఫలితాలు పొందవచ్చు.
































