దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. కొందరిలో కరోనా వైరస్ కు సంబంధించిన లక్షణాలు కనిపిస్తుంటే మరి కొందరికి వైరస్ సోకినా ఎటువంటి లక్షణాలు కనిపించడం లేదు. కరోనా వైరస్ ఒక్కొక్కరిలో ఒక్కో తరహా లక్షణాలు చూపించటానికి గల కారణాలు శాస్త్రవేత్తలకు కూడా తెలియలేదు. అయితే తాజాగా పరిశోధనల్లో లక్షణాలు కనిపించకపోవడానికి అసలు కారణం వెలుగులోకి వచ్చింది.

అమెరికాలోని ఓ బృందం కరోనా వైరస్ పై పరిశోధనలు చేసి కీలక విషయాలను వెల్లడించింది. ప్రత్యేకమైన కారణం వల్లే కొంతమందిలో లక్షణాలు కనిపించడం లేదని పేర్కొంది. కరోనా సోకినా లక్షణాలు కనిపించకపోవడానికి వైరస్ లో ఉండే స్పైక్ ప్రోటీన్ కారణం. స్పైక్ ప్రోటీన్ నాడీ మండలానికి నొప్పి సంకేతాలను పంపే రిసెస్టర్లను నిర్వీర్యం చేస్తుంది. ఫలితంగా లక్షణాలు లేని వాళ్లు వ్యాధి వ్యాప్తికి కారణమవుతున్నా ఇతరులకు వైరస్ సోకడం లేదు.
శరీరంలోని ఏసీఈ రిసెప్టర్లలో మొదట ఈ వైరస్ సోకుతుందని శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెల్లడైంది. ది జర్నల్ పెయిన్ అనే పత్రికలో ఈ పరిశోధనకు సంబంధించిన కథనాలు ప్రచురితమయ్యాయి. స్పైక్ ప్రోటీన్ నొప్పి ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శరీరంలో నొప్పిని కలగజేసే వీఈజీఎఫ్ ఏ ప్రోటీన్ కు ఈ ప్రోటీన్ కు సంబంధం ఉందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.
అమెరికాకు చెందిన డాక్టర్ రాజేష్ ఖన్నా మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలన్ తెలిపారు. వైరస్ గురించి మరిన్ని పరిశోధనలు చేస్తున్నామని శాస్త్రవేత్తలు వెల్లడించారు. కరోనా లక్షణాలు కొందరిలో కనిపించి, కొందరిలో కనిపించక పోవడంపై ఇంతకాలం భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తాజా పరిశోధనలతో ఆ ప్రశ్నలకు సమాధానం దొరికినట్లే అని చెప్పవచ్చు.






























