Niharika Drugs Case: చట్టం దృష్టిలో అందరూ సమానులేనని ఎన్ని చెప్పినా, ఎంత వాదించినా అది కేవలం నీతి వాఖ్యాలు వల్లించడానికి, పుస్తకాల్లో చదువుకోవడానికో పరిమితమైనట్టు తెలుస్తుంది. నేరం చేసిన వ్యక్తి ఎంతటి వాడైనా శిక్ష విధించాలని న్యాయ శాస్త్రం చెబుతున్నా దానికి విరుద్ధంగా జరుగుతోంది. సామాన్య ప్రజలకు ఒక న్యాయం, పేరున్న పెద్దలకు మరో న్యాయంలా తోస్తోంది ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే. ఇవన్నీ చూస్తుంటే ఒక వ్యక్తికి పదవి, పలుకుబడి ఉంటే అన్నీ మానిపోతాయా ? తప్పులు కాకుండా పోతాయా ? వీటి గురించి అందరూ ఇలా చర్చించుకునే వారే గానీ అధికారంగా ఎలాంటి చర్చా ఉండదు.

ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఆ పేరున్న వ్యక్తుల మధ్యలో కూడా వివక్ష చూపిస్తున్నట్టు అనిపిస్తోంది. ఒకే రంగానికి చెందిన పలు సినీ ప్రముఖులకు సంబంధించిన ఈ చర్చపై ఇప్పుడు దేశమంతా మాట్లాడుకుంటోంది.ఇక వివరాల్లోకి వెళితే ఇటీవల హైదరాబాద్‌లోని ఓ పబ్‌లో జరిగిన పోలీసుల దాడిలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖ పిల్లలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అందులో ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి చెందిన నాగబాబు కూతురు నిహారిక కూడా ఉండడం ప్రస్తుతం సంచలనంగా మారింది.

పట్టుబడ్డ కొన్ని గంటల్లోనే ఆమెకు నోటీసులు జారీ చేసి, పోలీసులు ఆమెను ఇంటికి పంపించారు. ఇక ఆ పబ్‌లో దొరికిన మత్తు పదార్థాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇదంతా నిన్నటి వరకూ జరిగిన విషయం కాగా, ఇదే విషయంపై ఇప్పుడు మరొక అంశం తెరపైకి వచ్చింది. అదేంటంటే ఇదే తరహాలో బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా ఓ క్రూయిజ్ షిప్‌లో పార్టీ చేసుకుంటుండగా , మత్తు పదార్థాలు సప్లై చేస్తున్నారు, తీసుకుంటున్నారన్న ఆరోపణలతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
ఒక్కొక్కరికి ఒక్కో న్యాయమా…
క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ నిహారిక కేసుకు, ఆర్యన్ ఖాన్ కేసుకు పెద్ద తేడా ఏమీ లేదు. కానీ అప్పట్లో ఆర్యన్ ఖాన్‌ను మాత్రం చాలా ఇబ్బందులు గురిచేశారనే వార్తలు ఇప్పుడు మళ్లీ వెలుగులోకి వస్తున్నాయి. అదే తరహా కేసు అయినప్పటికీ నిహారికకు కేవలం నోటీసులిచ్చి, కొన్ని గంటల వ్యవధిలోనే ఇంటికి పంపించేశారు. కానీ ఆర్యన్ ని మాత్రం పోలీసులు దాదాపు 22రోజులు జైలులో ఉంచారు. పలు మార్లు బెయిల్‌కు సంప్రదించినా కోర్టు తిరస్కరించింది. ఈ కేసు అప్పట్లో తీవ్ర సంచలనంగా మారగా, ప్రస్తుతం నిహారిక వ్యవహారం బయటకు రావడంతో అప్పడు అలా చేశారు, ఇప్పుడెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు. ఒక్కొక్కరికీ ఒక్కో న్యాయమా అంటూ విరుచుకుపడుతున్నారు.































