జైపూర్‌లో రెండు మధ్య వయసు మహిళలు నిర్వహించిన సెక్స్‌టార్షన్ రాకెట్ దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. పరీక్, ఇందు వర్మ అనే ఇద్దరు మహిళలు తమ అందాన్ని ఆయుధంగా మార్చి ధనవంతులను టార్గెట్ చేస్తూ కోట్ల రూపాయలు వసూలు చేస్తూ పోలీసులకు అడ్డంగా పట్టుబడ్డారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, వీరిద్దరూ ముందుగా ధనవంతులైన వ్యక్తులను గుర్తించి, వారితో స్నేహం పెంచుతూ, ఆ తర్వాత గాఢ సంబంధాల్లోకి తీసుకెళ్లేవారు.

వారు మొదట నమ్మకాన్ని కలిగించేందుకు రొమాంటిక్‌గా ప్రవర్తించి, అవసరమైతే శారీరక సంబంధానికి కూడా సిద్ధమవుతారు. ఒకసారి బాధితులు పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యారనుకున్న తర్వాత అసలు రంగు బయటపడుతుంది. వారు రూ.50 లక్షలు డిమాండ్ చేస్తారు. చెల్లించకపోతే రేప్ కేసు పెడతామని బెదిరిస్తారు. ఒకవేళ డబ్బులు ఇవ్వడానికి అంగీకరిస్తే, బాండ్ పేపర్లపై సంతకాలు తీసుకుని మరీ డబ్బులు వసూలు చేస్తారు. ఒక్కసారిగా ఇవ్వలేనివారికి “EMI స్కీమ్” కూడా ఆఫర్ చేస్తారు. ఇక చెల్లించకపోతే తరచూ ఫోన్ కాల్స్, బెదిరింపులతో బాధితులను వేధించడం ప్రారంభిస్తారు. పరువు భయంతో చాలామంది నోటికి తాళం వేసుకొని లక్షల్లో డబ్బులు చెల్లించినట్లు సమాచారం.
అయితే ఓ బాధితుడి స్నేహితుడు ధైర్యం చేసి చిత్రకూట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటికే రూ.1 లక్ష చెల్లించిన బాధితుడిని మిగతా డబ్బుల కోసం వేధిస్తున్న సమయంలో పోలీసులు ఫేక్ ఫోన్ కాల్ ప్లాన్ చేస్తూ హోటల్‌లో వారిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2.26 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. వీరి బాధితుల సంఖ్య ఎంత? వసూలైన మొత్తం ఎంత? అనే దానిపై పోలీసులు ఇంకా విచారణ జరుపుతున్నారు.
ఈ ఘటన నెగెటివ్ ట్రెండ్‌లను, శారీరక, మానసిక బ్లాక్‌మెయిలింగ్‌ను ఏ రీతిలో వినియోగిస్తున్నారో స్పష్టంగా చూపిస్తోంది. పరిచయాలు, సంబంధాలు ఏవైనా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ఆకర్షణల వెనక ఏవైనా ఉద్దేశాలు దాగి ఉండొచ్చు అనే విషయాన్ని ఈ సంఘటన మరోసారి తేల్చిచెబుతోంది.

































