కరోనా మహమ్మారి కారణంగా దాదాపు ఏడాదిన్నరగా చాలామంది వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. ఇక వాటికి చెక్ పెట్టేందుకు కొన్ని సాప్ట్ వేర్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. తమ ఉద్యోగులను ఆఫీస్ కు రావాలని ఆదేశిస్తున్నాయి. కరోనా కేసులు నమోదవుతున్నా.. ఎక్కువగా ఉండటం లేదు. దీంతో పాటు.. వ్యాక్సిన్ కూడా చాలామంది తీసుకున్నారు.

ఎకానమీ కూడా బాగానే పుంజుకోవడంతో.. ఇక ఇంట్లో పనికి సెలవు పెట్టి.. ఆఫీస్ బాట పట్టాల్సిందే అంటూ ఐటీ సంస్థలు చెబుతున్నాయి. దీనిలో భాగంగానే బ్యాంకులు, ఫిన్ టెక్ సంస్థలు, ఎన్బీఎఫ్సీలు తమ ఉద్యోగులను ఆఫీసులకు రప్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో గర్భిణులు, 65 ఏళ్లు పైబడిన వారికి మినహాయింపు ఇస్తున్నారు.
వాళ్ల వరకు ఇంటి నుంచి పని చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. కొన్ని కంపెనీలు వారి ఉద్యోగస్తులకు దగ్గరుండి మరీ టీకాలు ఇప్పించారు. దీంతో రెండో డోస్ పూర్తయిన పదిహేను రోజుల తర్వాత ఆఫీస్ కు రమ్మని కబురు కూడా పెట్టారు. మరికొన్ని కంపెనీల విషయానికి వస్తే.. కరోనా థర్డ్ వేవ్ పొంచి ఉన్న నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్లాలో అర్థం కాగ కంగారు పడుతున్నాయి.
థర్డ్ వేవ్ రాదని ప్రభుత్వం కూడా ఎలాంటి హామీ ఇవ్వలేదు.. ఎప్పుడైనా అది విరుచుకు పడే అవకాశం ఉందని చెప్పడంతో కొన్ని కంపెనీలు జంకుతున్నాయి. అయితే వ్యాక్సిన్ తీసుకున్న ఎంప్లాయిస్‌లను మాత్రమే ఆఫీసుకు రమ్మన్నామని, మిగతా వారికి అక్టోబరు 31 దాకా వర్క్ ఫ్రం హోం ఉంటుందని విప్రో తెలిపింది. మగ ఎంప్లాయిస్ వర్క్ ఫ్రం హోంనే కోరుకుంటున్నారని.. మహిళల్లో ఎక్కువ మంది ఆఫీసులకు రావడానికి రెడీగా ఉన్నారని హెచ్‌ఆర్ వర్గాలు తెలిపాయి.































