Writer Sri Sri : మద్రాస్ లో ఉండడంతోనూ, ఆధునిక కవి కావడంతోనూ సినిమా వారి పరిచయం బాగా వుండేది. ప్రత్యక్షంగా సినిమాలతో సంబంధం లేకపోయినా పరోక్షంగా సంబంధం వుండేది. 1950లో ఆ సంబంధం పూర్తిగా ప్రత్యక్షమయ్యింది. తెలుగులో మొట్టమొదటి డబ్బింగ్ సినిమా “ఆహుతి”కి ఇతడు మాటలు, పాటలు వ్రాశాడు. ఇది హిందీ చిత్రం “నీరా ఔర్ నందా”కి ఈ సినిమా తెలుగు అనువాదం. కవిత్వంలో రకరకాల ఫీట్లు చెయ్యడం ఇతడికి తెలుసు కాబట్టి డబ్బింగ్ ఫీట్ కూడా ఇతను చేయగల సమర్థుడని ఈ అవకాశం దక్కింది. ఇది డబ్బింగ్ సినిమా అయినా దీనిలో శ్రీశ్రీ మంచి పాటలు వ్రాశాడు. ఈ పాటల మూలంగానే ఇతడికి రోహిణి సంస్థలో హెచ్.ఎం.రెడ్డి నెలకు 300 రూపాయల జీతమిచ్చి ఇతనిని ఆస్థాన రచయితగా వేసుకున్నాడు.

నిర్దోషి సినిమాకు కొన్ని పాటలు వ్రాశాడు. మూనాన్ ప్రపంచం అనే సినిమా తీస్తూ ఇతడిని రచయితగా నెలకు 200 రూపాయలు జీతంతో నియమించుకున్నాడు. ఆ విధంగా ఇతడికి నెలకు 500 రూపాయలు రాబడి రావడంతో సినిమాలలో స్థిరపడ్డాడు. అలా ఈ ఉద్యోగాలు మూడేళ్ళపాటు సాగాయి. ఒక సారి ఒక కన్నడ చిత్రానికి తెలుగులో డబ్బింగ్ డైలాగులు వ్రాయడానికి మైసూరుకు వెళ్ళినప్పుడు అక్కడ ఇతనికి బి.విఠలాచార్యతో పరిచయం కలిగింది. అతను కన్నడలో తీసిన కన్యాదానం అనే సినిమాను తెలుగులో కూడా నిర్మించదలచి శ్రీశ్రీని రచయితగా నియమించుకున్నాడు. ఇతడు మైసూరులో వుండి ఒక్కరోజులో 12 పాటలు వ్రాశాడు. ఇది ప్రపంచ చలనచిత్రలోకంలో ఒక రికార్డు!

తరువాత ఇతడు డబ్బింగ్ రచయితగా, పాటల రచయితగా స్థిరపడ్డాడు. డబ్బింగ్ సినిమాలకు పాటలు, మాటలు వ్రాశాడు. మామూలు చిత్రాలకు కూడా పాటలు వ్రాశాడు. అన్ని రకాల పాటలు ముఖ్యంగా ఉద్రేకం, ఉత్తేజం కలిగించే పాటలు ఇతడు వ్రాశాడు. తెలుగు వారిని ఉర్రూతలూగించిన చాలా సినిమా పాటలను రచించాడు. అల్లూరి సీతా రామ రాజు సినిమాకు అతను రాసిన “తెలుగు వీర లేవరా” అనేది శ్రీశ్రీ రాసిన ఆణిముత్యాల్లో ఒకటి. అయితే శ్రీశ్రీ రచనలు దశాబ్దాలు దాటి 1980 దశకం వచ్చేసరికి కొంత తగ్గుముఖం పట్టింది.

ఆ క్రమంలో 1983లో దర్శకుడు టి.కృష్ణ ఓ అభ్యుదయ చిత్రం రూపొందించాలనుకున్నారు. అలాగే సినిమాకి జనజాగృత పాటలను రాయించుకోవాలనుకున్నారు. ఆ క్రమంలో అభ్యుదయ, సామాజిక విప్లవాత్మక పాటల రచన చేసిన శ్రీ శ్రీ ఆయనకు గుర్తుకు వచ్చారు. కానీ శ్రీశ్రీ అప్పటికే అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నారు. ఎలాగైనా ఈ సినిమాలో శ్రీశ్రీతో ఒక్క పాటైనా రాయించుకోవాలని దర్శకుడు టి.కృష్ణ, నిర్మాత పోకూరి బాబూరావు అనుకున్నారు. “నేటి భారతం” సినిమాలో పాపులర్ అయిన పాట..”భారతమాతను నేను బందీ నై ఉన్నాను”. అనే పాటను 1983, జూన్ 4న ఆస్పత్రిలో బెడ్ పై నుండి శ్రీ శ్రీ ఈ పాటను రాశారు. అప్పటికి వారం రోజుల క్రితమే శ్రీశ్రీకి మాట పడిపోయింది. ఆయన రాసిన పాటలో చరణంలో కాస్త మార్పు చేయడానికి ఈ సినిమాలో మూడు పాటలు రాసిన ప్రముఖ గేయ రచయిత అదృష్టదీపక్… శ్రీశ్రీ దగ్గరికి వెళ్లి ఆ పాటలోని చరణాన్ని సరి చేయించారు.

రేపే ఆ పాట చిత్రీకరణ అయినా లొకేషన్ ఏమిటో యూనిట్ సభ్యుల్లో ఎవరికి టి.కృష్ణ చెప్పలేదు. మద్రాసులోని అరుణాచలం స్టూడియోలో ఓ కాలి ఫ్లోర్ ని బుక్ చేయమని ఆయన పురమాయించారు. ఆర్ట్ డైరెక్టర్ తో ఒక చెరసాల దర్శకుడు టి.కృష్ణ వేయించారు. అలాగే భారతదేశ పటాన్ని గీయించారు, దాని చుట్టూ ఒక తాడును చుట్టించి మధ్యలో ఇసుక పోయించి విజయశాంతికి సంకెళ్లు పెట్టి మధ్యలో కూర్చోబెట్టారు. ఆ పాట చిత్రీకరణ అద్భుతంగా జరిగింది. 1983 లో విడుదలైన “నేటిభారతం” చిత్రం అద్భుతమైన విజయాన్ని సాధించింది. అలాగే శ్రీశ్రీ రాసిన పాట కూడా ప్రజాదరణ పొందింది.

ఆ తర్వాత క్యాన్సర్ మహమ్మారిని తట్టుకోలేని శ్రీ శ్రీ 1983 జూన్ 15 న తాను రాసిన జనజాగృతి రచనలన్ని సాహితీ అభిమానులకు వదిలేసి అనంతలోకాలకు పయనమయ్యారు. శ్రీ శ్రీ మరణం సినీ పరిశ్రమకే కాదు తెలుగు సాహితీ రంగానికి ఒక తీరని లోటు.. 1950 లో ఆయన రాసిన “మహాప్రస్థానం” కార్మిక, కర్షక, శ్రామిక పీడిత ప్రజలను ఉత్తేజపరుస్తూ.. వెలువడిన తెలుగు సాహిత్య సంకలనం. ఆధునిక తెలుగు సాహిత్యం మహాప్రస్థానానికి ముందు, తర్వాత అని విభజించేంతగా మహాప్రస్థానం ప్రజాదరణ పొందింది. ఆయన మరణానంతరం విశాఖపట్నం లోని బీచ్ రోడ్డులో అతని నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.శ్రీశ్రీ విగ్రహం, హైదరాబాదులోని ట్యాంకుబండ్ పై కూడా ప్రతిష్ఠించడం విశేషం.































