బరువు తగ్గాలనుకునే చాలా మంది ముందుగా చేసే మార్పు అన్నం మానేయడమే. “రైస్ తింటే వెంటనే బరువు పెరుగుతాం” అనే భావన ఇప్పుడు చాలామందిలో బలంగా ఉంది. దీంతో చాలామంది రాత్రి భోజనంలో మాత్రమే కాదు, పూర్తిగా అన్నాన్ని డైట్ నుంచి తీసేస్తున్నారు. కానీ ఆరోగ్య నిపుణులు మాత్రం దీనిపై భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సరైన మోతాదులో తీసుకుంటే అన్నం వల్ల నేరుగా బరువు పెరగదని చెబుతున్నారు.

భారతీయుల ఆహారపు అలవాట్లలో అన్నం ప్రధాన భాగం. ముఖ్యంగా దక్షిణ భారత రాష్ట్రాల్లో రోజువారీ భోజనంలో ఇది తప్పనిసరి. శరీరానికి తక్షణ శక్తిని అందించే కార్బోహైడ్రేట్లు అన్నంలో సమృద్ధిగా ఉంటాయి. అంతేకాదు బి విటమిన్లు, కొంతమేర ప్రోటీన్, ఖనిజాలు కూడా అందుతాయి. ముఖ్యంగా బ్రౌన్ రైస్, దంపుడు బియ్యంలో పీచు పదార్థం ఎక్కువగా ఉండటంతో జీర్ణక్రియకు మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
అయితే బరువు పెరగడానికి ప్రధాన కారణం అన్నం మాత్రమే కాదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. రోజూ శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ కేలరీలు తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం, వ్యాయామం చేయకపోవడం వంటి అంశాలే బరువు పెరుగుదలకు కారణమవుతాయని చెబుతున్నారు. అన్నం తినే పరిమాణం, దానికి తోడు తీసుకునే ఆహారం కూడా కీలక పాత్ర పోషిస్తాయి.
చాలామంది ప్లేట్ నిండా అన్నం తీసుకుని, దానికి ఎక్కువ నూనెతో చేసిన కూరలు లేదా ఫ్రై ఐటమ్స్ కలిపి తింటుంటారు. దీంతో కేలరీలు అధికమవుతాయి. అలాగే రాత్రి వేళల్లో అధికంగా అన్నం తీసుకుని వెంటనే నిద్రపోవడం వల్ల శరీరంలో శక్తి వినియోగం తగ్గి కొవ్వుగా నిల్వ అయ్యే అవకాశం ఉంటుంది.
ఆరోగ్యకరంగా అన్నం తినాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని న్యూట్రిషన్ నిపుణులు సూచిస్తున్నారు. ఒక పూటకు పరిమిత మోతాదులో మాత్రమే తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. తెల్ల బియ్యం కంటే బ్రౌన్ రైస్ లేదా దంపుడు బియ్యం తీసుకోవడం మరింత ఉపయోగకరమని అంటున్నారు. అలాగే అన్నంతో పాటు పప్పులు, ఆకుకూరలు, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే శరీరానికి సమతుల్య పోషకాలు అందుతాయి.
మధ్యాహ్న సమయంలో అన్నం తినడం ఉత్తమమని, రాత్రి సమయంలో తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా భోజనం తర్వాత కొంతసేపు నడక లేదా స్వల్ప వ్యాయామం చేయడం వల్ల ఆహారం సులభంగా జీర్ణమవుతుంది.
మొత్తానికి అన్నం పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని, సరైన పరిమాణంలో, సరైన విధంగా తీసుకుంటే అది ఆరోగ్యకరమైన ఆహారంలో భాగమేనని నిపుణులు చెబుతున్నారు.



























