పన్నీర్ తినడం వల్ల బరువు పెరుగుతారా.. లేదా తగ్గుతారా. దీని గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం. పన్నీర్ ను పాల నుండి తయారు చేస్తారు. తయారు చేసిన పాలలో కొవ్వు శాతాన్ని బట్టి పన్నీర్ లో ఎంత కొవ్వు ఉంటుందో తెలుస్తుంది. తక్కువ కొవ్వు ఉన్న పాలనుంచి చేసిన పన్నీర్ లో మాంసకృత్తులు ఎక్కువ.

ఎముకల పటుత్వానికి అవసరమైన కాల్షియమ్, ఫాస్ఫరస్‌తో పాటు విటమిన్ బి- 12 పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఎముకలు గట్టిగా ఉంటాయి. మాంసకృత్తులు ఎక్కువగా ఉన్నా, కొంత పిండి పదార్థాలున్నప్పటికీ పన్నీర్ గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ కాబట్టి మధుమేహం ఉన్నవారు కూడా తీసుకోవచ్చు. వంద గ్రాముల పన్నీర్ లో సుమారుగా 250 నుండి 300 కెలోరీలు ఉంటాయి.
కాబట్టి మోతాదుకు మించి తీసుకుంటే బరువు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్స్‌లో ఉండే నూనెలో వేయించిన పన్నీర్ వంటలు ఎక్కువగా తింటే బరువు పెరుగుతారు. పరిమిత మోతాదులో, అంటే రోజుకు 60 -70 గ్రాములకు మించకుండా పన్నీర్ తీసుకుని, రోజులో మిగతా ఆహారాన్ని కూడా కెలోరీ పరిధికి లోబడి తీసుకుంటే మంచిది. అధిక బరువు ఉన్నవారు కూడా పన్నీర్ తీసుకోవచ్చు. పన్నీర్ లో మాంసకృత్తుల వలన ఆకలి త్వరగా వేయదు.
బరువు తగ్గాలనుకునే వారు ఓ పూట పన్నీర్ తీసుకొంటే బరువు తగ్గేందుకూ ఉపయోగ పడుతుంది. అనారోగ్యకరమైన కొవ్వు పదార్థాలను మీరు ఎక్కువగా తిన్నప్పుడు.. పన్నీరు మీ బరువు తగ్గించడంలో భాగంగా కొవ్వును బర్న్ చేస్తుంది. ఇతర పాల వనరులతో పోలిస్తే ఆవు పాలలో కేసిన్ అనే ప్రోటీన్ అధికంగా ఉంటుంది. కాబట్టి ఆవు పాలను ఉపయోగించి తయారు చేసిన పన్నీర్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి.































