వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు గత కొన్ని నెలలుగా అధికార పార్టీలో ఉంటూ ఆ పార్టీపైనే విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. సాధారణంగా ఏ రాష్ట్రంలోనైనా ప్రతిపక్షం అధికారంలో ఉన్న పార్టీని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. ఏపీలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోంది. తాజాగా సీఎం జగన్ ను సీఎం పదవి నుంచి తప్పించాలంటూ సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.

ఈ పిటిషన్ గురించి రఘురామ కృష్ణంరాజు స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరైతే కోర్టు ధిక్కరణకు పాల్పడతారో వారు రాజ్యాంగ పదవుల్లో ఉండేందుకు అర్హత కోల్పోతారని చెప్పారు. జగన్ సీఎం పదవిని కోల్పోయే అవకాశాలు ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఢిల్లీలోని తన నివాసం నుంచి మీడియాతో మాట్లాడుతూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ తప్పు జరిగిందని క్షమాపణలు చెబితే మాత్రమే పదవిలో కొనసాగవచ్చని అన్నారు.
ప్రభుత్వం న్యాయవ్యవస్థపై దాడి చేయడం సరి కాదని అన్నారు. జగన్ సర్కార్ రాజధాని భూముల్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెబుతోందని .. ఆ ఆరోపణల్లో నిజం లేదని వ్యాఖ్యానించారు. న్యాయవాదులు న్యాయవ్యవస్థపై దాడికి నిరసనగా ఉద్యమం చేసే అవకాశామం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ సర్కార్ న్యాయవ్యవస్థపై చేసిన దాడిని కోర్టు ధిక్కరణగానే పరిగణించాలని తెలిపారు.
జగన్ క్షమాపణలు చెప్పని పక్షంలో ప్రత్యామ్నాయ ముఖ్యమంత్రిని సిద్ధం చేసుకోవాలని రఘురామ వ్యాఖ్యానించారు. జగన్ తల్లి విజయమ్మ లేక ఆయనకు బదులుగా సీఎం కావచ్చని వ్యాఖ్యలు చేశారు. సెక్షన్ 174 కింద కేసు నమోదు చేసి వివేకానందరెడ్డి హత్య కేసులో పోలీసులపై చర్యలు తీసుకోవాలని రఘురామ అన్నారు.