ఆధార్ లింకింగ్‌కు డెడ్ లైన్స్ ఇవే
ఆధార్ నెంబర్.. 12 అంకెల ఈ నెంబరే ఇప్పుడు ఓ వ్యక్తి చరిత్రను మొత్తం చెబుతుంది. ఆధార్ ఒక్కటి ఉంటే చాలు.. మన దేశంలో ఎన్నో పనులు అయిపోతాయి. అదే ఆధార్ లేకపోతే.. ఎన్నో పనులు ఆగిపోతాయి. అంత ప్రాధాన్యత ఉన్న ఆధార్ కార్డును ఇప్పుడు ప్రభుత్వం ప్రతి దానిలో తప్పనిసరి చేసింది. ఆధార్‌ను పాన్ కార్డుతో లింక్ చేయడం, సిమ్ కార్డుతో లింక్ చేయడం, బ్యాంక్ అకౌంట్‌తో లింక్ చేయడం, గ్యాస్ తో లింక్ చేయడం.. ఇప్పుడు కొత్తగా త్వరలోనే డ్రైవింగ్ లైసెన్స్‌తోనూ లింక్ చేయనున్నాం. ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి కూడా ఆధార్ ఇప్పుడు తప్పనిసరి. ఇలా ప్రతి దానికి తప్పనిసరి అయిన ఆధార్ ను వాటి ఆఖరు తేదీల్లోగా లింక్ చేయకపోతే ఆ సర్వీసులు నిలిచిపోనున్నాయి. ఆ సర్వీసులేంటో తెలుసుకుందాం పదండి…
పాన్ కార్డుతో ఆధార్ లింకింగ్ కు చివరి తేదీ డిసెంబర్ 31, 2017
పాన్ కార్డుతో ఆధార్ ను లింక్ చేసుకోవడానికి పోయిన నెల ఆగస్టు 31 వరకే డెడ్ లైన్ ఉన్నప్పటికీ.. డిసెంబర్ 31, 2017 వరకు డేట్ ను సీబీడీటీ(Central Board of Direct Taxes) పెంచింది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి ఇన్ కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి ఆధార్ – పాన్ లింకింగ్ ను తప్పని సరి చేసింది ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్.
ఒకవేళ, ఆధార్ – పాన్ ను లింక్ చేయకపోతే.. ఇన్ కమ్ టాక్స్ రిటర్న్స్ ను పరిగణనలోకి ఐటీ శాఖ తీసుకోదు. దీంతో మళ్లీ పెనాల్టీతో రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది.
ఆధార్ తో సిమ్ కార్డ్ లింకింగ్ కు చివరి తేదీ.. ఫిబ్రవరి 2018
ఫిబ్రవరి 2018 లోగా… సిమ్ కార్డ్స్‌ను ఆధార్ తో లింక్ చేసుకోకపోతే ఆ నెంబర్ డియాక్టివేట్ అవుతుంది. సిమ్ కార్డ్స్‌ను ఆధార్ తో లింక్ చేసుకోవాలనుకునే వాళ్లు.. తమ నెట్ వర్క్స్ కు చెందిన స్టోర్‌కు వెళ్లి లింక్ చేసుకోవాలి. లింక్ చేయాల్సిన మొబైల్ నెంబర్ వాడుకలో ఉండాలి. అప్పుడు లింక్ చేయాలనుకున్న మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ని స్టోర్ వాళ్లకు చెప్పాలి. తర్వాత ఆధార్ నెంబర్ వాళ్లకు ఇవ్వాలి. అనంతరం బయోమెట్రిక్ ను వెరిఫై చేస్తారు. ఆ తర్వాత లింక్ చేసిన మొబైల్ నెంబర్ కు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. అంతే.. మీ మొబైల్ నెంబర్ తో ఆధార్ లింక్ అవుతుంది.
బ్యాంక్స్ ఫైనాన్సియల్ కంపెనీలకు సబ్మిట్ చేయడానికి చివరి తేదీ… డిసెంబర్ 31, 2017
బ్యాంక్ అకౌంట్స్, ఫైనాన్సియల్ కంపెనీలతో ఆధార్ ను లింక్ చేయాడానికి డిసెంబర్ 31, 2017 చివరి తేదీ. కేవైసీ డాక్యుమెంట్ లో తప్పని సరిగా బ్యాంకులు, ఫైనాన్సియల్ కంపెనీలు కస్టమర్ల ఆధార్ డిటేయిల్స్ ను అప్ డేట్ చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. లోన్స్ తీసుకున్న కస్టమర్లు కూడా తమ ఆధార్ డిటేయిల్స్ ను బ్యాంకులకు సమర్పించాల్సి ఉంటుంది. డిసెంబర్ 31, 2017 లోపు బ్యాంకుల్లో ఆధార్ ను సబ్మిట్ చేయకపోతే.. ఆ అకౌంట్లు రద్దయిపోనున్నాయి. రూ. 50 వేల కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు కూడా ఆధార్ డిటేయిల్స్ ను తప్పనిసరిగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ లో ఆధార్‌ను లింక్ చేయడానికి చివరి తేదీ.. డిసెంబర్ 31, 2017
డిసెంబర్ 31, 2017 లోగా పెన్షన్, గ్యాస్ సిలిండర్, గవర్నమెంట్ స్కాలర్ షిప్స్, ఇంకా ఇతర సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ కోసం ఆధార్ నెంబర్ ను లింక్ చేయాల్సిందే. అప్పటిలోగా ఆధార్‌ను లింక్ చేయకపోతే.. ఆ సర్వీసులన్నీ నిలిచిపోనున్నాయి.