ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలకు విద్యుత్ శాఖ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ప్రతి ఇంటికి నాలుగు ఎల్‌ఈడీ బల్బులను పంపిణీ చేయడానికి సిద్ధమవుతోంది. 10 రూపాయల చొప్పున ఎక్కువ సామర్థ్యం ఉన్న ఎల్‌ఈడీ బల్బులను విద్యుత్ శాఖ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి అందించనుందని సమాచారం. గ్రామ ఉజాలా పేరుతో రాష్ట్రంలో ఈ స్కీమ్ అమలు కానుందని సమాచారం.

ఏపీ ఇంధన పొదుపు సంస్థ సీఈవో ఎ చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. తొలి విడత బల్బుల పంపిణీ కృష్ణా జిల్లాలో ప్రారంభం కానుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది. కేంద్ర ఇంధన పొదుపు సంస్థ ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీస్ లిమిటెడ్ ద్వారా గ్రామ ఉజాలా పథకం మొదట దేశంలోని ఐదు ప్రధాన ప్రాంతాల్లో మొదలు కానుంది.
ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీస్ లిమిటెడ్ ఈ స్కీమ్ అమలు కోసం ఏకంగా 450 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని తెలుస్తోంది. దేశంలోని ఐదు రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ఈ స్కీమ్ అమలు కానుందని తెలుస్తోంది. ఆ తరువాత కేంద్రం దేశవ్యాప్తంగా ఈ స్కీమ్ ను అమలు చేయనుంది. ఈ స్కీమ్ అమలులో భాగంగా 12 ఓల్టుల ఎల్‌ఈడీ బల్బుల పంపిణీ ప్రక్రియ జరుగుతుంది.
25 శాతం మన్నిక ఎక్కువగా ఉండే ఎల్‌ఈడీ బల్బులు సాధారణ బల్బులతో పోల్చి చూస్తే 75 శాతం కరెంట్ ను ఆదా చేస్తాయి. కృష్ణా జిల్లాలోని విజయవాడ టౌన్, రూరల్, మచిలీపట్నం, నూజివీడు, గుణదల, గుడివాడలలో విద్యుత్ బల్బుల పంపిణీ ప్రక్రియ జరుగుతుంది. ప్రస్తుతం 8.83 లక్షల ఇళ్లకు బల్పుల పంపిణీ జరగనుందని ఆ తరువాత రాష్ట్రవ్యాప్తంగా ఈ స్కీమ్ అమలు జరగనుందని తెలుస్తోంది.
































