విశాఖపట్నం పర్యాటక రంగంలో మరో కొత్త ఆకర్షణ చేరింది. సముద్ర తీర సోయగాలకు ప్రసిద్ధి చెందిన కైలాసగిరిపై భారీ త్రిశూలం ఏర్పాటు చేయడంతో పర్యాటకుల దృష్టి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌పై పడింది. ఇప్పటికే శివపార్వతుల విగ్రహాలు, రోప్‌వే, టాయ్ ట్రైన్, గ్లాస్ బ్రిడ్జ్ వంటి ప్రత్యేక ఆకర్షణలతో సందర్శకులను ఆకట్టుకుంటున్న కైలాసగిరి.. ఇప్పుడు ఈ భారీ త్రిశూలంతో మరింత ప్రత్యేకంగా మారింది.

వైజాగ్ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్‌ను రూపుదిద్దించారు. సుమారు 65 అడుగుల ఎత్తుతో డమరుకం ఆకృతితో కూడిన ఈ త్రిశూలాన్ని కొండపై ప్రతిష్ఠించారు. విశాఖ నగరంలోని పలు ప్రాంతాల నుంచి కూడా ఇది స్పష్టంగా కనిపించేలా నిర్మాణాన్ని రూపొందించారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రత్యేక లైటింగ్ మధ్య ఈ త్రిశూలం మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోందని అధికారులు చెబుతున్నారు.
కైలాసగిరి అంటే చాలా మందికి ముందుగా గుర్తుకు వచ్చేది అక్కడి భారీ శివపార్వతుల విగ్రహాలే. ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచిన ఈ ప్రదేశాన్ని మరింత అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో విఎంఆర్డీఏ కొత్త ప్రాజెక్ట్‌లపై దృష్టి పెట్టింది. అందులో భాగంగానే ఈ భారీ త్రిశూలాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. పర్యాటకంతో పాటు భక్తి భావన కూడా కలగలిసేలా ఈ నిర్మాణాన్ని డిజైన్ చేశారు.
ఈ ప్రాజెక్ట్ కోసం సుమారు రూ.2.5 కోట్ల వ్యయం చేసినట్లు సమాచారం. ప్రత్యేక డిజైన్‌ను మహారాష్ట్రలోని పుణేలో రూపొందించి, అనంతరం భాగాలను విశాఖకు తరలించి కైలాసగిరిపై అమర్చారు. నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తవగా, అధికారిక ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి.
విశాఖలో గత కొన్నేళ్లుగా పర్యాటక రంగాన్ని మరింత విస్తరించే దిశగా అనేక ప్రాజెక్టులు చేపడుతున్నారు. బీచ్‌లు, వ్యూవ్ పాయింట్లు, థీమ్ ప్రదేశాలతో పాటు ఆధ్యాత్మిక పర్యాటకాన్ని కూడా ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ భారీ త్రిశూలం కూడా అదే క్రమంలో కొత్త గుర్తింపుగా నిలవనుందని అధికారులు భావిస్తున్నారు.
స్థానికులతో పాటు బయట ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు కూడా ఈ కొత్త ఆకర్షణను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా సెల్ఫీలు, ఫోటోగ్రఫీకి ఇది హాట్ స్పాట్‌గా మారే అవకాశం ఉందని టూరిజం వర్గాలు అంచనా వేస్తున్నాయి.



























