ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయం పూట పండ్లు తినడం మంచిదనే అభిప్రాయం చాలామందిలో ఉంది. అయితే అన్ని రకాల పండ్లు ఖాళీ కడుపుతో తినడానికి సరిపోవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని పండ్లు జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపి ఎసిడిటీ, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు కారణమవుతాయని చెబుతున్నారు. ముఖ్యంగా ఉదయాన్నే కడుపు ఖాళీగా ఉన్న సమయంలో ఏం తింటున్నామన్నది చాలా ముఖ్యం అంటున్నారు వైద్యులు.

పుల్లటి రుచితో ఉండే నారింజ, మోసంబి, అనాస వంటి సిట్రస్ పండ్లలో యాసిడ్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇవి ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే కడుపులో మంట, ఎసిడిటీ సమస్యలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
అరటిపండు కూడా చాలామంది ఉదయం మొదటగా తింటుంటారు. అయితే ఇందులో సహజ చక్కెరలు, మెగ్నీషియం అధికంగా ఉండటం వల్ల కొందరిలో బ్లడ్ షుగర్ ఒక్కసారిగా పెరగవచ్చని చెబుతున్నారు. ఖాళీ కడుపుతో అరటిపండు తింటే అలసట లేదా కడుపు భారంగా అనిపించే అవకాశమూ ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
వేసవిలో ఎక్కువగా తినే పుచ్చకాయ, కర్బూజ వంటి పండ్లను కూడా పరిమితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ ఖాళీ కడుపుతో ఎక్కువగా తింటే జీర్ణక్రియ మందగించి కడుపు ఉబ్బరం వచ్చే ప్రమాదం ఉందంటున్నారు.
అలాగే మామిడి, సీతాఫలం, చీకూ వంటి తీపి పండ్లలో సహజ చక్కెరలు అధికంగా ఉంటాయి. ఇవి ఉదయం నేరుగా తీసుకుంటే ఇన్సులిన్ స్థాయిలపై ప్రభావం పడే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
ఉదయం సమయంలో బొప్పాయి, యాపిల్ వంటి తేలికగా జీర్ణమయ్యే పండ్లు తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే పండ్లు తినే ముందు గోరువెచ్చని నీరు లేదా నానబెట్టిన బాదం తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుందని చెబుతున్నారు.





























