BJP : కర్ణాటకలో బొక్క బోర్లాపడ్డ బీజేపీ.. షేక్ అవుతున్న జగన్ ప్రభుత్వం..!

0
182

BJP : కర్ణాటకలో బీజేపీ ఘోర పరాజయం మాటేమో కానీ.. దానిని చూసి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల్లో వణుకు పుడుతోంది. ప్రజల్లో బీజేపీపై ఎంతటి వ్యతిరేకత ఉందో తెలుసుకునేందుకు ఇదో పెద్ద ఉదాహరణ. ఇతర రాష్ట్రాల మాటేమో కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. ఎంతసేపు తెలంగాణను చూస్తున్నామే కానీ ఏపీలో పరిస్థితులు కూడా దారుణంగా తయారయ్యాయి. దీనికి కారణాలు లేకపోలేదు. కర్ణాటకలో నెలకొన్న పరిస్థితులే ఇంచుమించుగా ఏపీలో కూడా నెలకొనడం ఒక కారణమైతే.. బీజేపీతో దోస్తి మరో కారణం.

40 శాతం కమీషన్‌ సర్కార్‌..

గత ఎన్నికల అనంతరం కర్ణాటకలో జేడీఎస్‌తో కలిసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ప్రభుత్వాన్ని ఎంతో కాలం సాగనివ్వకుండా ఎమ్మెల్యేలను కొనేసి ప్రభుత్వాన్ని అస్థిరపరిచి బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. ఇది అక్కడి ప్రజల్లో అసహనాన్ని రేపింది. ఆ తరువాత బొమ్మై సీఎంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇది అవినీతి, అక్రమాలకు నిలయంగా మారింది. ప్రతి పనికి కూడా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు కమీషన్లు తీసుకునేవారు. దీంతో సర్కార్‌పై అవినీతి ఆరోపణలకు అంతే లేకుండా పోయింది. ‘40 శాతం కమీషన్‌ సర్కార్‌’అనే నినాదాన్ని కాంగ్రెస్ పార్టీ బాగా యూజ్ చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ విజయానికి ఇది కూడా ఒక కారణం. ఏపీలోనూ ఇవే పరిస్థితులు ఉన్నాయి. అవినీతి, అక్రమాలు పేరుకు పోయాయన్న టాక్ ఉంది. ఈ విషయం సీఎం జగన్ దృష్టికి కూడా వెళ్లిందని తెలుస్తోంది. దీనిపై ఆయన ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఇక ప్రతి ఒక్క పనికి ప్రజాప్రతినిధులు కమీషన్లు తీసుకుంటున్నారన్న టాక్ కూడా ఉంది. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ఎమ్మెల్యేలకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి.

కేంద్రం మెడలు వంచుతాం..

స్వలాభం కోసం కేంద్రంతో దోస్తీ చేసి జనాల్లో ఏపీ ప్రభుత్వం చాలా పలుచన అయిపోయింది. నిజానికి రాజధాని కార్యక్రమానికి ప్రధాని మోదీ వచ్చి మట్టి, నీళ్లు గిఫ్ట్‌గా ఇచ్చి వెళ్లిన దగ్గర నుంచి కూడా ఆ పార్టీపై ఏపీ జనాల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. అలాంటి బీజేపీతో వైసీపీ దోస్తీ చేస్తే చేసింది కానీ ఏ విషయంలోనూ.. ఏపీకి ఎంత అన్యాయం జరుగుతున్నా కూడా సీఎం జగన్ నోరు మెదిపింది లేదు. కేంద్రం మెడలు వంచుతామని ఆర్భాటంగా ప్రకటనలు చేసి అధికారంలోకి వచ్చి ఆయనే సరెండర్ అయిపోయారంటూ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేస్తున్నా కూడా పెదవి విప్పలేదు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వకున్నా.. సైలెన్స్ మెయిన్‌టైన్ చేసింది. ఇవన్నీ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. ఇప్పుడు కర్ణాటకలో బీజేపీపై వచ్చిన వ్యతిరేకతను చూసిన తర్వాత వైసీపీకి వెన్నులో వణుకు పుడుతోందని టాక్.

ఏపీ జనమెరిగిన సత్యం..

కర్ణాటక ఫలితాలు అన్ని రాష్ట్రాలకూ ఒకింత అలెర్ట్ సిగ్నల్ జారీ చేశాయి. ఈ నేపథ్యంలో ఇక ముందు బీజేపీతో వైసీపీ ఎలా ఉంటుందన్నదే ఆసక్తికరంగా మారింది. బీజేపీ ఏం చేసినా తానా అంటే తందానా అంటుందా? లేదంటే సైలెంట్‌గా తన పని తాను చూసుకుంటుందా? అంటే ఇక ముందు కూడా ఈ రెండింటిలో ఏదో ఒకటి చేయడం ఎదురు తిరిగేంత సీన్ అయితే ప్రస్తుత తరుణంలో వైసీపీకి లేదు. ఇది ఏపీ జనమెరిగిన సత్యమే. ఈ సమయంలో ఏమైనా కేంద్రానికి ఎదురు తిరిగితే కేసులు ఉండనే ఉన్నాయి. ఇప్పటి వరకూ మోదీ అండతోనే వాటి నుంచి జగన్ బయట పడుతూ వస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అసలే ఎన్నికల తరుణం. ఈ సమయంలో ఏదైనా జరిగితే అసలుకే ఎసరొస్తుంది. కాబట్టి గప్ చుప్.