Chiranjeevi: తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, ఏపీ ప్రభుత్వానికి మధ్య టికెట్ ధరల వివాదం నడుస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇటీవల పలువురు నటులు, అటు ప్రభుత్వం నుంచి మంత్రుల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు జరిగిన సంగతి తెలిసిందే.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి.. ఇండస్ట్రీ సమస్యలు, టికెట్ రేట్ల విషయంపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈసమస్యలకు త్వరలోనే పరిష్కారం అవుతుందని.. సీఎం జగన్ చెప్పారని చిరంజీవి వెల్లడించారు.

అంతవరకు అందరూ సంయమనం పాటించాలని.. ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకూడదని సూచించారు. త్వరలోనే ఓ టీమ్ గా వచ్చి సీఎం గారిని కలుస్తాం అంటూ క్లారిటీ ఇచ్చారు.ఇదిలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి, జగన్ భేటీ సరికొత్త చర్చకు దారి తీసింది.
సమస్యలపై చర్చించే వారే అయితే..
రాజ్యసభకు చిరంజీవిని వైసీపీ తరుపున పంపుతారనే చర్చ జరుగుతోంది. తాజాగా రాజ్యసభలో కొంతమంది నాయకుల పదవీకాలం దగ్గర పడింది. అదే సమయంలో టాలీవుడ్ సమస్యలు చర్చించేందుకు చిరంజీవి, సీఎం నివాసానికి వెళ్లారు. ఇదే సమయంలో రాజ్యసభ విషయం చర్చకు వచ్చిందంటూ పలువురు చర్చించుకుంటున్నారు. సమస్యలపై చర్చించే వారే అయితే ఒక్కరే ఎందుకు వెళ్తారు అనే పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇంకేదైనా విషయం గురించి చర్చించేందుకు వన్ టూ వన్ మీటింగ్ జరిగిందంటూ తమదైన రీతిలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ రూమర్స్ పై చిరంజీవి స్పందించారు. ”తెలుగు సినీ పరిశ్రమ మేలుకోసం,థియేటర్ల మనుగడ కోసం,ఆంధ్రప్రదేశ్ సి.ఎం శ్రీ వై స్ జగన్ గారిని కలిసి చర్చించిన విషయాలని పక్కదోవ పట్టించే విధంగా,ఆ మీటింగ్ కి రాజకీయరంగు పులిమి నన్ను రాజ్యసభకు పంపుతున్నట్లు కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేస్తున్నాయి. అవన్నీ పూర్తిగా నిరాధారం. రాజకీయాలకు దూరంగా ఉంటున్న నేను మళ్లీ రాజకీయాలలోకి,చట్టసభలకు రావటం జరగదు. దయచేసి ఊహాగానాలని వార్తలుగా ప్రసారం చేయవద్దు. ఈ వార్తలకి,చర్చలకు ఇప్పటితో పుల్ స్టాప్ పెట్టమని కోరుతున్నాను” అంటూ ట్విట్టర్ వేదికగా చిరంజీవి వెల్లడించారు .































