ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పుష్ప-2 సినిమాలోని ‘‘రప్పా రప్పా’’ డైలాగ్‌ను ఆధారంగా చేసుకొని పల్నాడులో జరిగిన వాగ్దాడిని తీవ్రంగా ఖండించిన చంద్రబాబు, ‘‘ఇలాంటి హింసాత్మక ప్రసంగాలు ప్రజాస్వామ్యంలో ప్రోత్సహించదగినవి కావు’’ అని హెచ్చరించారు.

‘‘ఒకప్పుడు గ్రామ దేవతలకు బలి ఇచ్చే కార్యక్రమాల్లో ‘రప్పా రప్పా’ అనేవారు. ఇప్పుడు అదే సంభాషణను పునఃప్రయోగిస్తూ ప్రజల్లో భయానక వాతావరణాన్ని సృష్టించడమేంటి?’’ అంటూ మండిపడ్డారు. యోగా డే వంటి శాంతియుత కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంలో ఇటువంటి ఉద్రిక్తతలు అవసరమా? అంటూ జగన్‌పై విమర్శల వర్షం కురిపించారు.
‘‘ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకులకు నైతిక స్థిరత్వం, చట్టపరమైన గౌరవం ఉండాలి. పోలీసులను గౌరవించడం ఓ నాయకుడిగా కనీస బాధ్యత. నేరస్తులతో కలిసి రాజకీయాలు చేయడం అనేది ప్రజలకు పంపే ప్రమాదకరమైన సందేశం. ఇది రాష్ట్ర భద్రతకు విఘాతం కలిగించే చర్య’’ అని చంద్రబాబు అన్నారు.
‘‘ఇసుక, మద్యం, గంజాయి మాఫియాలను పెంచిన ప్రభుత్వం ప్రజలకు లా అండ్ ఆర్డర్ పాఠాలు చెప్పగలదా? హత్యలు, అత్యాచారాలు చేసిన వారికే విగ్రహాలు పెడితే – చట్టాన్ని గౌరవించే పోలీసులకు మాత్రం విమర్శలూ, అడ్డంకులా?’’ అంటూ ప్రశ్నించారు. వైసీపీ నాయకుల బల ప్రదర్శనను తీవ్రంగా ఖండించిన చంద్రబాబు, ‘‘ఇది ప్రజాస్వామ్యం కాదని, ఇది ప్రజలపై దౌర్జన్యం అని స్పష్టం చేశారు.’’
‘‘నన్ను విశాఖ, తిరుపతిలో ఆపిన సందర్భంలో నేను నైతికంగా స్పందించాను. కానీ, ఇక్కడ ప్రవర్తిస్తున్న విధానం చూస్తే ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. రాష్ట్రంలో అశాంతిని రెచ్చగొట్టే ఏ చర్యనైనా ప్రభుత్వం తగిన రీతిలో ఎదుర్కుంటుంది,’’ అని చంద్రబాబు నాయుడు గట్టిగా హెచ్చరించారు.






























