గతంలో భారత్ లో, ఇతర దేశాల్లో అనేక వైరస్ లు, బ్యాక్టీరియాలు వ్యాప్తి చెందాయి. అయితే ఆ వైరస్ లు, బ్యాక్టీరియాల ప్రభావం ఆయా దేశాల ఆర్థిక స్థితిగతులపై మాత్రం పడలేదు. అయితే కరోనా వైరస్ విషయంలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోంది. కరోనా వైరస్ దొంగదెబ్బ కొడుతోంది. చాప కింద నీరులా శరవేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ మహమ్మారి గురించి పరిశోధనలుచేసే కొద్దీ ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

దేశంలో చాలామంది కరోనా వైరస్ బారిన పడినా వారిలో వైరస్ కు సంబంధించిన ఒక్క లక్షణం కూడా కనిపించడం లేదు. ఫలితంగా కరోనా వైరస్ శరీరంలో అభివృద్ధి చెందుతున్నా చాలామందికి తమ ఆరోగ్య సమస్య గురించి అర్థం కావడం లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్ సోకిన వారిలో 86 శాతం మందిలో ఎటువంటి లక్షణాలు కనిపించడం లేదని వెల్లడించింది. దగ్గు, జ్వరం, రుచి కోల్పోవడం లాంటి ప్రాథమిక లక్షణాలు కూడా కనిపించడం లేదని చెబుతోంది.
లక్షణాలు కనిపించకపోవడం వల్ల వాళ్లు ప్రమాదంలో పడటంతో పాటు ఇతరులు కూడా కరోనా వైరస్ బారిన పడేలా చేస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. యూనివర్సిటీ కాలేజ్ లండన్ పరిశోధకులు ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా పరీక్షల సంఖ్యను పెంచడం ద్వారా మాత్రమే వైరస్ ను కట్టడి చేయడం సాధ్యమవుతుందని వెల్లడిస్తున్నారు. నేషనల్ స్టాటిస్టిక్స్ డేటా ద్వారా అధ్యయనం చేసి శాస్త్రవేత్తలు ఈ వివరాలను వెల్లడించారు.
మరోవైపు వైద్య నిపుణులు కరోనా రోగుల్లో కొత్త లక్షణాలు వెలుగులోకి వస్తున్నాయని.. ఆ లక్షణాలను కూడా చేర్చాలని చెబుతున్నారు. కరోనా లక్షణాలు కనిపించని వారు దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతూ ఉంటే ప్రాణాలకే ముప్పు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలసట, ఊపిరి తీసుకోలేకపోవడం లాంటి లక్షణాలు కనిపించినా కరోనా కావచ్చని ఈ లక్షణాలు కనిపించిన వాళ్లు వెంటనే పరీక్షలు చేయించుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.


































