తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ మొదట ఎవరికంటే..?

0
425

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. కరోనా కేసులు, మరణాలు తగ్గుతూ పెరుగుతూ గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వైరస్ బారిన పడే అవకాశాలు ఉంటాయని.. వైరస్ ను కట్టడి చేసే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేంత వరకు మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, తరచూ శానిటైజర్ల సహాయంతో చేతులను శుభ్రం చేసుకోవడం తప్ప మరో మార్గం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మొదట ఎవరికిస్తారనే చర్చ జరుగుతోంది. కేంద్రం పలు సందర్భాల్లో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మొదట వైద్య, ఆరోగ్య సిబ్బందికి ఇస్తామని చెబుతోంది. మరోవైపు పలు కార్పొరేట్ కంపెనీలు మొదట తమకే వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి తెలంగాణ రాష్ట్రంలోని వ్యాక్సిన్ మొదట ఎవరికిస్తారనే ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఈటల రాజేందర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

సమర్థవంతమైన కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో పేదలకే ప్రథమ ప్రాధాన్యత ఉంటుందని మంత్రి వెల్లడించారు. తెలంగాణను ఆరోగ్య రంగంలో భారత్ కే రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ప్రజలకు ఆరోగ్య రంగం ద్వారా మరింత ప్రయోజనాలు చేకూర్చడం కొరకు నివేదికను సిద్ధం చేశామని మంత్రి వెల్లడించారు. కరోనా వ్యాక్సిన్ వస్తే బస్తీల్లో ఉండే వాళ్లకు మొదట అందేలా చూస్తామని చెప్పారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులను కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా తయారు చేసే దిశగా అడుగులు పడుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. టెక్నాలజీ సహాయసహకారాలతో ప్రతి వ్యక్తి ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలను ఆన్ లైన్ లో నమోదయ్యే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు. ఆశా వర్కర్లు పల్లెల్లో మెరుగైన సేవలు అందిస్తున్నారని మంత్రి ప్రశంసించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మరింత బలోపేతం చేసే ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here