జలుబును కలిగించే కరోనా సోకిన వారికి శుభవార్త?

0
1412

గడిచిన ఏడు నెలలుగా ప్రపంచ దేశాల ప్రజల మధ్య కరోనా వైరస్ గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది. కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతూ మహా నగరాల నుంచి మారుమూల పల్లెల వరకు విస్తరిస్తోంది. అయితే కరోనా వైరస్ లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా కనిపిస్తున్నాయి. కొందరిలో జ్వరం, జలుబు, శ్వాస సంబంధిత సమస్యలు కరోనా లక్షణాలుగా కనిపిస్తే మరి కొందరిలో మాత్రం ఇతర లక్షణాలు కనిపిస్తున్నాయి.

తాజాగా కరోనా వైరస్ గురించి శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి మరో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. శాస్త్రవేత్తలు కరోనా వైరస్ లలో అనేక రకాలు ఉంటాయని వాటిలో కొన్ని మాత్రమే జలుబు, న్యూమోనియాను కలిగిస్తాయని చెబుతున్నారు. ఇప్పటివరకు నమోదైన కేసులను పరిశీలించి చూస్తే జలుబు కరోనా లక్షణంగా కనిపించిన వారిలో కరోనా తీవ్రత తక్కువగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. జలుబు కరోనా లక్షణంగా కనిపించని వారిలో మాత్రం తీవ్రత ఎక్కువగా ఉందని పేర్కొన్నారు.

అమెరికాలోని బోస్టన్‌ యూనివర్సిటీ పరిశోధకులు తమ పరిశోధనల ద్వారా ఈ విషయాలను వెల్లడించారు. ఇప్పటివరకు నమోదైన కేసుల వివరాలపై అధ్యయనం చేసి ఈ ఫలితాలను వెల్లడించినట్టు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. తమ పరిశోధనల్లో జలుబుతో కూడిన కరోనా వచ్చిన వాళ్లు ఆస్పత్రుల్లో చేరిన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. వీళ్లకు మరణాల ముప్పు తక్కువగా ఉందని పేర్కొన్నారు.

జలుబుతో కూడిన కరోనా సోకిన వాళ్లకు వెంటిలేటర్ల అవసరం కూడా పెద్దగా లేదని శాస్త్రవేత్తలు తెలిపారు. శాస్త్రవేత్తలు కొందరు కరోనా వైరస్ సోకినా త్వరగా కోలుకోవడానికి, కొందరు ఎన్ని రోజులు చికిత్స పొందినా త్వరగా కోలుకోలేకపోవడానికి ఇవే కారణాలని వెల్లడించారు జర్నల్‌ ఆఫ్‌ క్లినికల్‌ ఇన్వెస్టిగేషన్‌ అనే పత్రికలో శాస్త్రవేత్తల పరిశోధనలకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రచురితమయాయి.