బ్యాంక్ ఖాతాకు.. పాన్ కార్డును లింక్ చేయాలని.. ఆధార్, పాన్ కార్డును కూడా లింక్ చేసుకోవాలని ప్రభుత్వం మొదటి నుంచి చెబుతూనే ఉంది. అయితే అలా చేస్తున్న క్రమంలో అధికారిక వెబ్ సైట్ కి వెళ్లి మాత్రమే చేసుకోవాలని కూడా సూచించింది. అయితే సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. ఎట్టి పరిస్థితుల్లో తమ ఫోన్లకు వచ్చే లింక్ లను ఓపెన్ చేయవద్దని పోలీసులు అవగాహన కార్యక్రమలు కూడా నిర్వహిస్తున్నారు. ఇవన్నీ తెలిసి కూడా కొంతమంది సైబర్ వలలో పడుతున్నారు.

చదువు లేని వాళ్లు అంటే.. తెలిసి.. తెలియక ఇలా చేశారు అనుకుంటే.. చదువుకున్న మూర్ఖులు కూడా ఇలానే చేస్తున్నారు. తర్వాత లబోదిబో మంటూ మొత్తుకొని పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి ఘటనలు మనం రోజూ చూస్తునే ఉన్నాం. అలాంటిదే మరొకటి నిజామాబాద్ లో చోటుచేసుకుంది.
బ్యాంక్ ఖాతాకు పాన్‌కార్డు లింక్ చేయమని వచ్చిన మెసేజ్ ను క్లిక్ ఇచ్చి.. తన అకౌంట్లో ఉన్న దాదాపు రూ. 4.90 లక్షలను పోగొట్టుకున్నాడు ఓ బాధితుడు. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ లోని కంఠేశ్వర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి బ్యాంక్ అకౌంట్‌కు పాన్‌కార్డు లింక్ చేయాలని సెప్టెంబర్ 30వ తేదీ మెసేజ్ వచ్చింది. అలాగే అతడు లింక్ ను ఓపెన్ చేసి అన్ని వివరాలను ఇచ్చాడు.
తర్వాత వెంటనే మరో వ్యక్తి ఫోన్ చేసి ఎస్ బీఐ నుంచి మాట్లాడుతున్నామని చెప్పి.. మొబైల్ కు వచ్చిన ఓటీపీ చెప్పమన్నారు. ఆ నంబర్ చెప్పిన కాసేపటికే తన బ్యాంక్ ఖాతాలోని రూ.4.90 లక్షల విత్‌డ్రా అయినట్లు మెస్సేజ్ వచ్చింది. వెంటనే సదరు వ్యక్తి వెళ్లి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకున్నారు. ఓటీపీని అపరిచిత వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదని సూచించారు.































