ఉదయం ఎలా ప్రారంభమవుతుందో, అదే రోజు మొత్తం ఎలా సాగుతుందో నిర్ణయిస్తుందని ఆరోగ్య నిపుణులు తరచూ చెబుతుంటారు. ముఖ్యంగా నిద్రలేవగానే చేసే అలవాట్లు మన శరీరం, మెదడు పనితీరుపై నేరుగా ప్రభావం చూపిస్తాయి. ఈ నేపథ్యంలో Dr Sudhir Kumar ఉదయపు మొదటి గంటలో పాటించాల్సిన నియమాలు, దూరంగా ఉండాల్సిన అలవాట్ల గురించి కొన్ని కీలక సూచనలు వెల్లడించారు.

నిపుణుల ప్రకారం, నిద్రలేచిన తర్వాత తొలి గంటలో శరీరం సహజ గడియారం అయిన Circadian Rhythm ప్రకారం రీసెట్ అవుతుంది. ఈ సమయంలో మనం చేసే చిన్న పొరపాట్లు రోజంతా అలసట, అసహనం, ఏకాగ్రత లోపం వంటి సమస్యలకు కారణమవుతాయి. అందుకే ఉదయం ప్రారంభాన్ని సరిగ్గా ప్లాన్ చేసుకోవడం చాలా అవసరం.
ముఖ్యంగా సూర్యరశ్మి పాత్ర కీలకమని వైద్యులు చెబుతున్నారు. నిద్రలేచిన కొద్దిసేపటిలోనే బయటకు వెళ్లి కొద్దిసేపు ఎండలో ఉండటం వల్ల శరీరంలో ‘కోర్టిసోల్’ స్థాయులు సహజంగా పెరిగి మనల్ని చురుగ్గా మారుస్తాయి. అదే సమయంలో రాత్రి నిద్రకు అవసరమైన ‘మెలటోనిన్’ ఉత్పత్తి కూడా సమయానికి జరుగుతుంది. దీని వల్ల నిద్ర-జాగరణ చక్రం సక్రమంగా కొనసాగుతుంది.
చాలామందికి ఉన్న అలవాటు అయిన బెడ్ కాఫీ విషయంలో కూడా జాగ్రత్త అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. నిద్రలేచిన వెంటనే కాఫీ లేదా టీ తాగడం వల్ల శరీరంలో సహజంగా తగ్గాల్సిన రసాయనాలు పూర్తిగా తగ్గకపోవచ్చు. దీంతో మధ్యాహ్నం సమయంలో అకస్మాత్తుగా అలసట, నిద్రమత్తు పెరిగే అవకాశం ఉంటుంది. కనీసం గంటన్నర తర్వాతే కాఫీ తాగడం మంచిదని సూచిస్తున్నారు.
అలాగే ఉదయం మొదట తీసుకోవాల్సినది నీరే అని వైద్యులు చెబుతున్నారు. రాత్రంతా శరీరం కొంత నీటిని కోల్పోతుంది కాబట్టి నిద్రలేవగానే తగినంత నీరు తాగడం ద్వారా శరీరాన్ని మళ్లీ సక్రియంగా మార్చుకోవచ్చు. నీటితో పాటు తేలికపాటి వ్యాయామం లేదా నడక చేస్తే రక్తప్రసరణ మెరుగుపడి శరీరం, మెదడు ఉత్సాహంగా మారతాయి.
ఇక చేయకూడని అలవాట్లలో ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ వినియోగం ముందుంటుంది. నిద్రలేవగానే ఫోన్ స్క్రీన్ చూడడం వల్ల మెదడు వెంటనే అధిక సమాచార ఒత్తిడికి లోనవుతుంది. సోషల్ మీడియా నోటిఫికేషన్లు, మెసేజ్‌లు వంటి వాటి వల్ల ఏకాగ్రత దెబ్బతింటుంది. కనీసం ఉదయం తొలి గంటలో ఫోన్‌కు దూరంగా ఉండడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
అలారం మోగగానే మళ్లీ మళ్లీ ‘స్నూజ్’ కొట్టడం కూడా శరీరానికి మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. ఇలా చేయడం వల్ల మెదడు పూర్తిగా మేల్కొనే ప్రక్రియ ఆలస్యమవుతుంది. దీంతో గంటల తరబడి నిద్రమత్తు కొనసాగుతుంది.
ఉదయం తీసుకునే అల్పాహారం విషయంలో కూడా జాగ్రత్తలు అవసరం. అధిక చక్కెర ఉన్న పదార్థాలు, మైదా వంటివి తీసుకుంటే రక్తంలో షుగర్ స్థాయిలు ఒక్కసారిగా పెరిగి తర్వాత తగ్గిపోతాయి. దీంతో మళ్లీ ఆకలి, అలసట వస్తాయి. అందుకే ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే ఆహారాన్ని ఎంచుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
మొత్తానికి, ఉదయం మొదటి గంటను సరిగ్గా ఉపయోగించుకుంటే రోజంతా ఉత్సాహంగా గడపవచ్చు. చిన్న చిన్న అలవాట్లలో మార్పులు చేసుకోవడం ద్వారా శరీరానికి, మనసుకు పెద్ద ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.































