సాధారణంగా రోడ్డుపై కార్లు, బస్సులు, లారీలు వంటివి ప్రయాణం చేస్తాయి. రైలు పట్టాలపై కేవలం రైళ్లు మాత్రమే పరుగులు పెడతాయి.కానీ మీరు ఎప్పుడైనా రైలు పట్టాలపై కారు పరుగులు పెట్టడం చూశారా..? వినడానికి ఎంతో ఆశ్చర్యంగా ఉంది కదూ! కానీ ఈ వీడియో చూస్తే మాత్రం ఇదెలా సాధ్యమైందని ఆలోచిస్తారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో రైలు పట్టాలపై ప్రయాణిస్తున్నటువంటి కారుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.అసలు రైలు పట్టాలపై ఈ కారు ప్రయాణించడానికి కారణం ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..

ఈ విధంగా రైలు పట్టాలపై కారు ప్రయాణించిన ఘటన బ్రిటన్ లో చోటుచేసుకుంది. హెర్ట్ ఫోర్ట్ షైర్‌లోని చెస్తాన్‌టెన్ రైల్వే స్టేషన్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది.పూర్తి వివరాలలోకి వెళ్తే ఈ కారు నడుపుతున్న వ్యక్తి ఆ కారును దొంగతనం చేసి తీసుకు వస్తున్నాడు. అయితే కారును పోలీసులు పట్టుకోవడం తో ఆ వ్యక్తి పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించి, పోలీసుల వాహనాలను, ఇతర కార్లను ఢీ కొడుతూ అక్కడినుంచి తప్పించుకున్నాడు.
ఈ క్రమంలోనే పోలీసులు కూడా అతని వెంటపడటంతో అతను ఎంతో వేగంతో కారు నడుపుతున్నాడు. అయితే అతనికెదురుగా రైల్వే పట్టాలు ఉండడంతో సదరు వ్యక్తి ఎంతో వేగంతో కారును రైలు పట్టాలపైకి ఎక్కించాడు.ఈ విధంగా ఒక కారు వేగంతో రైలు పట్టాలపై ప్రయాణించడంతో రైల్వేస్టేషన్లోని ప్రయాణికులు, సిబ్బంది ఎంతో ఆశ్చర్యపోయారు.
ఈ క్రమంలోనే రైల్వే అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సమాచారం అందుకున్న పోలీసులు సదరు రైల్వే స్టేషన్ కి వెళ్లారు. ఈ క్రమంలోనే ఆ వ్యక్తి కారుని ఎంతో వేగంతో నడుపుతూ ఆగకుండా రైల్వే స్టేషన్ లో ఆగివున్న రైలుకి ఢీ కొట్టింది. అప్పటికే అలర్ట్ అయిన అధికారులు అతన్ని అరెస్టు చేసి జైలుకు తరలించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇలాంటి ఆశ్చర్యకర సంఘటన ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.