తెలుగు బుల్లితెర పై పలు కార్యక్రమాలలో, పలు సినిమా ఈవెంట్లలో సందడి చేస్తూ ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ శ్యామల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శ్యామల భర్త ప్రముఖ బుల్లితెర నటుడు నరసింహారెడ్డి పలు సీరియల్స్ లో సందడి చేశారు. అయితే తాజాగా నరసింహారెడ్డిని రాయదుర్గం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు…

నరసింహారెడ్డి ఓ మహిళ దగ్గర కోటి రూపాయలు అప్పుగా తీసుకుని తిరిగి చెల్లించకపోవడంతో పాటు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఓ మహిళ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. నరసింహా రెడ్డితో పాటు మరొక మహిళను కూడా పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.
2017 వ సంవత్సరం నుంచి నరసింహారెడ్డి తన దగ్గర విడతలవారీగా దాదాపు కోటి రూపాయల వరకు అప్పు తీసుకున్నట్లు సదరు మహిళ పేర్కొంది. తన దగ్గర నుంచి తీసుకున్న అప్పు తిరిగి చెల్లించాలని అడగడంతో అప్పు చెల్లించకపోవడమే కాకుండా తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని బాధితురాలు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
ఈ వ్యవహారంలోనే ఒక సెటిల్మెంట్ చేయాలంటూ మధ్యవర్తిగా ఓ మహిళ వ్యవహరించి తనపై ఒత్తిడి తీసుకు వచ్చిందని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.ఫిర్యాదు తీసుకున్న పోలీసులు రంగంలోకి దిగి నటుడు నరసింహారెడ్డి తోపాటు మధ్యవర్తిగా వ్యవహరించిన ఆ మహిళను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని వారిని రిమాండ్ కి తరలించారు.


































