ఈ రోజుల్లో ఐరన్ లోపం సమస్య విస్తృతంగా కనిపిస్తోంది. ముఖ్యంగా మహిళల్లో ఇది ఎక్కువగా ఉండటం గమనార్హం. సరైన పోషకాహారం తీసుకోకపోవడం, శరీర అవసరాలు పెరగడం, రక్తహీనత వంటి కారణాలతో ఈ సమస్య తలెత్తుతుంది. ఐరన్ స్థాయిలు తగ్గిపోతే అలసట, తల తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చర్మం నిస్సత్తువగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని చిన్న సమస్యగా భావించి నిర్లక్ష్యం చేయడం వల్ల పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

శరీరానికి అవసరమైన హిమోగ్లోబిన్ తయారీలో ఐరన్ కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే ఈ లోపాన్ని సకాలంలో గుర్తించి ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం అవసరం. పాలకూర, మెంతి, గోంగూర వంటి ఆకుకూరలు ఐరన్‌కు మంచి వనరులు. అలాగే బీట్‌రూట్, దానిమ్మ, ఖర్జూరం, ఎండుద్రాక్ష వంటి పండ్లు కూడా రక్తహీనత తగ్గించడంలో సహాయపడతాయి. కాయధాన్యాలు, శనగలు, సోయాబీన్స్ వంటి పదార్థాలను కూడా రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం మంచిది.
మాంసాహారులు గుడ్లు, చేపలు, చికెన్ వంటి పదార్థాలను తీసుకోవడం ద్వారా కూడా ఐరన్‌ను పెంచుకోవచ్చు. అయితే ఐరన్ ఉన్న ఆహారం తీసుకోవడం మాత్రమే కాకుండా, అది శరీరానికి సరిగ్గా చేరేలా చూసుకోవడం కూడా ముఖ్యం. నిమ్మకాయ, నారింజ, ఉసిరి వంటి విటమిన్ C అధికంగా ఉండే ఆహారాలు ఐరన్ శోషణను మెరుగుపరుస్తాయి. అదే సమయంలో టీ, కాఫీని వెంటనే తీసుకోవడం తగ్గించాలి.
అలాగే జీవనశైలి కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. సమయానికి భోజనం చేయడం, సరిపడా నిద్రపోవడం, శారీరక చురుకుదనం పాటించడం అవసరం. ఐరన్ లోపం ఎక్కువగా ఉంటే వైద్యుల సూచనతో మందులు లేదా సప్లిమెంట్లు తీసుకోవాలి. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా సమస్యను ముందుగానే గుర్తించి నియంత్రించవచ్చు.





























