నాలుగు రోజుల క్రితం కాన్పుకు ఆసుపత్రిలో అడ్మిట్ అయింది ఓ గర్భిణి. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది ఆ తల్లి. ఆ శిశువుకు ఆరోగ్యం బాగాలేదని వైద్యులకు చూపించగా.. సపరేట్ రూంలో ఆమెను తన శిశువును ఉంచారు. అన్నం తీసుకురావడానికి వెళ్లిన ఆమె భర్త.. ఆసుపత్రికి వచ్చేసరికి అతడి భార్య పక్కన ఆ శిశువు కనిపించలేదు.

దీంతో అతడు ఆసుపత్రి సిబ్బందికి చెప్పాడు. లాభం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లాకు చెందిన కోమలి అనే మహిళ పురిటి నొప్పులతో స్థానికంగా ఉండే ఓ ఏరియా హాస్పిటల్‌లో అడ్మిట్ అయింది. ఆ రోజే ఆమె ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అయితే ఆమె శనివారం ఉదయం అంటే ఈరోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావాల్సి ఉంది.
ఆ శిశువుకు ఆరోగ్యం మంచిగా లేకపోవడంతో తల్లితో సహా ఆ పసికందును ఆసుపత్రి సిబ్బంది ఓ గదిలోకి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. అయితే కోమలి భర్త శ్రీరాములు భోజనం తేవడానికి బయటకు వెళ్లాడు. అతడు తిరిగి వచ్చేసరికి ఆ పసికందు మాయం అయిపోయింది. వెంటనే ఆసుపత్రి పరిసరాలంతా వెతికారు. అయినా ఉపయోగం లేదు.
పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆసుపత్రి ఆవరణలోని సీసీఫుటేజీ పరిశీలించారు. ఆ సీసీటీవీలో ఆ పసికందును ఓ బుర్ఖా వేసుకున్న ఓ మహిళ ఎత్తుకెళ్లినట్లు స్పష్టంగా కనిపించింది. అందులో ఆమె కాళ్లకు కనీసం చెప్పులు కూడా ధరించకుండా ఫాస్ట్ గా నడుచుకుంటూ వెళ్లడం గమనించవచ్చు. దీంతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఆమెను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.































