తెలంగాణ రాష్ట్రంలోని పోలీస్ వ్యవస్థపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. పోలీస్ స్టేషన్లు చట్టాన్ని అమలు చేసే కేంద్రాలుగా కాకుండా, భూ వివాదాల సెటిల్‌మెంట్ కేంద్రాలుగా మారిపోతున్నాయన్న ఆరోపణలపై కోర్టు సీరియస్ అయింది.. కోర్టు ఇచ్చిన ఇంజంక్షన్ ఉత్తర్వులను కూడా పోలీసులు పట్టించుకోకుండా జోక్యాలు చేస్తున్నారని పలు పిటిషన్లలో ఆరోపణలు రావడంపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

భూమి వివాదంలో పోలీసుల పాత్రపై కోర్టు ప్రశ్నలు
హైదరాబాద్ నాగోల్‌కు చెందిన సుదర్శనం అనే బాధితుడు హైకోర్టును ఆశ్రయించారు. ఆయన వాదనం ప్రకారం, బండ్లగూడ కృషినగర్‌లో ఉన్న ప్లాట్ నంబర్ 65 విషయంలో నాగోల్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన సివిల్ మరియు క్రిమినల్ కేసులను సొల్వ్ చేయాలంటే రూ.55 లక్షలు రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు చెల్లించాలని పోలీసులు ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు.
ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ తడకమల్ల వినోద్‌కుమార్ మాట్లాడుతూ, “ఇలాంటి ఘటనలు చూస్తుంటే పోలీస్ స్టేషన్లు చట్టాన్ని కాపాడే ప్రదేశాలు కాకుండా, సెటిల్‌మెంట్ కేంద్రాలుగా మారుతున్నాయన్న అభిప్రాయం కలుగుతుంది” అని వ్యాఖ్యానించారు.
హైకోర్టు పలు కీలక ఆదేశాలను ఇచ్చింది:
సివిల్ అంశాలలో పోలీసులు జోక్యం చేసుకోకూడదని డీజీపీ కార్యాలయం నుంచి స్పష్టమైన సర్క్యులర్ జారీ చేయాలని సూచించింది. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించింది. చెల్లుబాటు అయ్యే పత్రాలు లేకుండా “మేమే అసలైన హక్కుదారులం” అని చెప్పటం సరికాదని, గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కూడా గుర్తు చేసింది. ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించేందుకు సంబంధిత నిబంధనలను పోలీసు అధికారిక వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేయాలని, అన్ని స్టేషన్లలోనూ స్పష్టంగా ప్రదర్శించాలని ఆదేశించింది.
ఈ కేసులో రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు వర్చువల్‌గా హాజరయ్యారు. నాగోల్ సీఐ స్వయంగా కోర్టులో హాజరయ్యారు. కోర్టు “పోలీస్ స్టేషన్‌ను భూ వివాదాల సెటిల్‌మెంట్ కేంద్రంగా మార్చడం ఏమిటి?” అని ప్రశ్నించింది. అలాగే, సంబంధిత సీసీ టీవీ ఫుటేజ్‌ను సమర్పించాలంటూ ఆదేశిస్తూ, తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
ఈ వ్యాఖ్యలు, ఆదేశాలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రజాస్వామ్యంలో పోలీస్ వ్యవస్థ నైతికంగా, చట్టపరంగా ఎలా ఉండాలో గుర్తుచేసే విధంగా హైకోర్టు ఈ తీర్పు నిలిచింది.































