Hero Srikanth : ఖడ్గం, ఆపరేషన్ ధుర్యోధన సినిమాల్లో శ్రీకాంత్ పోషించిన పాత్రకు పలువురి విమర్శకుల ప్రశంసలు లభించాయి. స్వతహాగా చిరంజీవి అభిమానియైన శ్రీకాంత్ ఆయనతో కలిసి నటించాలని ఎంతో కోరికగా ఉండేవాడు. ఆయన కోరిక శంకర్‌దాదా ఎం.బీ.బీ.ఎస్ తో తీరింది. దానికి సీక్వెల్ గా వచ్చిన శంకర్‌దాదా జిందాబాద్ లో కూడా ఆయనతో కలిసి నటించాడు. బాలకృష్ణతో కలిసి శ్రీరామరాజ్యం సినిమాలో, వెంకటేష్ తో కలిసి సంక్రాంతి, నాగార్జునతో కలిసి నిన్నే ప్రేమిస్తా, మోహన్ బాబుతో తప్పుచేసి పప్పుకూడు, రాజేంద్ర ప్రసాద్ తో సరదాగా సరదాగా మొదలయిన సినిమాలలో నటించాడు. జగపతిబాబుతో మనసులో మాట, జె.డి. చక్రవర్తితో ఎగిరే పావురమా, రవితేజతో ఖడ్గం లాంటి సినిమాల్లో కలిసి నటించాడు.

శ్రీకాంత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సినిమా విజయానికి పరాజయానికి మధ్య నేను ఒకేలాగ ఉంటా.. ఓ హిట్ రాగానే పొంగిపోయి ఫ్లాప్ రాగానే ఫీల్ అయిపోవడం లాంటివి నేను పెట్టుకోను. కాకపోతే ఒక సినిమా ఫెయిలనప్పుడు ఇంకా మంచి డైరెక్టర్ లేదా మంచి సబ్జెక్టు ఎన్నుకోవాలని చూస్తాను. ఒకసారి ప్లాప్ వస్తే మరొక సినిమాతో హిట్టు కొట్టాలని ఆలోచిస్తాను. మళ్ళీ ఫ్లాప్ వస్తే అలానే ఆలోచిస్తాను తప్ప బాధపడుతూ కూర్చొనని ఆయన చెప్పారు. అలాగే కృష్ణవంశీ దర్శకత్వం లో వచ్చిన “మహాత్మ” చిత్రంలో నేను హీరోగా నటించాను. ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా విజయ్ ఆంటోనీ చేశారు. అప్పటినుంచి ఆయనతో పరిచయం ఉంది.

అయితే ‘బిచ్చగాడు’ సినిమాని తమిళ్ నుంచి తెలుగులోకి డబ్ చేయకముందు. ఆ సినిమాని తెలుగులో రీమేక్ చేయాలనుకున్నారు. విజయ్ నా ఫ్రెండ్ కావున ఆ సినిమాను కూడా నేను చూడడం జరిగింది. ఆ సినిమాని తెలుగులో చేస్తానని నిర్మాత చదలవాడ తిరుపతిరావు తో కూడా చెప్పాను. అంతకుముందే నేను ఫ్యామిలీ సబ్జక్ట్స్ చేయడంతో ఈ సినిమాలో కూడా కొంత సెంటిమెంట్ ని ఇంకా పెంచాలనుకున్నాం. అలా నా పారితోషికం, మూవీ బడ్జెట్ నిర్మాత అనుకున్న బడ్జెట్ కి ఎక్కువ అవడంతో వారు ఆ సినిమాని తమిళ్ నుంచి తెలుగులోకి డబ్ చేసుకున్నారు. ఆ విధంగా బిచ్చగాడు చిత్రం తెలుగులో రీమేక్ చేస్తే నేనే హీరోగా నటించే వాడినని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు.


































