మూడు రోజుల సంక్రాంతి.. తెలుగు వారీ ప్రత్యేకత.!

0
92

ప్రతి సంవత్సరం సూర్యుడు దక్షిణార్థ గోళంలో నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించిన రోజున సంక్రాంతిగా జరుపుకుంటారు.దేశం మొత్తం వివిధ రకాల పేర్లతో ఈ పండుగను ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. ఈ పండుగను మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రత్యేకంగా జరుపుకుంటారు. భోగి, మకర సంక్రాంతి, కనుమ ఈ మూడు రోజులపాటు ఇంటిముందు అందమైన ముగ్గులు వేసి, వివిధ రకాల పిండి వంటలు తయారు చేసి ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అయితే మూడు రోజుల పాటు జరిగే ఈ పండుగ ప్రత్యేకత ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

భోగ భాగ్యాలను ప్రసాదించే భోగి:
భోగ్ అనే సంస్కృత పదం నుంచి భోగి అనే పదం పుట్టింది. భోగం అంటే మంచిది అని అర్థం. ఈ భోగి పండుగ జరుపుకోవడం వల్ల భోగభాగ్యాలను ప్రసాదిస్తుందని నమ్ముతారు. సంక్రాంతికి ఒకరోజు ముందు భోగి పండుగను జరుపుకోవడంతో సంక్రాంతి సంబరాలు మొదలవుతాయి. ఈ భోగి రోజు సాక్షాత్తు గోదాదేవి శ్రీమన్నారాయణలో ఏకమైనదని భావిస్తారు. భోగి రోజు ఉదయం స్నానాలు ఆచరించి ఇంటి ముందు భోగి మంటలను వేసుకొని పాతకు స్వస్తి చెప్పి కొత్త దనాన్ని ఆహ్వానిస్తారు. ఈ భోగి పండుగ రోజు చిన్నపిల్లలకు భోగిపళ్ళు పోయడం ద్వారా వారు ఆరోగ్యంగా ఉంటారని భావిస్తారు.ఈ విధంగా ఎంతో ఘనంగా భోగి పండుగను నిర్వహించుకుంటారు.

సంక్రాంతి ప్రత్యేకత:

భోగి తర్వాత రెండవ రోజున సంక్రాంతిగా జరుపుకుంటారు. ధనుర్మాసం నుంచి సూర్యుడు ఉత్తరాయణ దిశగా పయనించి మకర రాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ రోజున మకర సంక్రాంతి అని పిలుస్తారు. ఈ పండుగ రోజు పెద్ద ఎత్తున ఇంటి ముందు అందమైన రంగ వల్లులను దిద్ది అందులో ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను వివిధ రకాల పువ్వులతో అలంకరించి ముగ్గు మధ్యలో పెడతారు. అంతే కాకుండా హరిదాసు గీతాలు, గంగిరెద్దుల కోలాహలం ఎంతో సంబరంగా ఈ పండుగను జరుపుకుంటారు. అంతే కాకుండా సంక్రాంతి పండుగకు రైతులు పండించే పంటలు అన్ని ఇంటికి చేరుకోవడం ద్వారా కూడా ఈ పండుగను రైతుల పండుగ అని పిలుస్తారు. సంక్రాంతి రోజు దానాలు చేయడం వల్ల పుణ్య ఫలం కలుగుతుంది. ఈ విధంగా సంక్రాంతి పండుగను ఎంతో ఘనంగా నిర్వహించుకుంటారు.

కనుమ:

సంక్రాంతి పండుగలో భాగంగా చివరి రోజున కనుమగా పురస్కరించుకుంటారు. ఈ కనుమ పండుగను తెలుగు రాష్ట్రాలలో రైతులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా పాడి పశువుల పాకలలో శుభ్రంగా కడిగి ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాలలో కనుమ రోజు కొన్ని ప్రాంతాలలో పెద్ద ఎత్తున కోడి పందాలు నిర్వహిస్తుంటారు.ఈ కోడిపందాలను చూడటానికి ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాలకు చేరుకుంటారు.ఈ విధంగా మూడు రోజులపాటు సంక్రాంతి ఉత్సవాలను ఎంతో ఘనంగా జరుపుకుంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here