కరోనా మహమ్మారి విజృంభణ వల్ల గతేడాదికి ఈ ఏడాదికి ప్రజల జీవన విధానంలో చాలా మార్పులు వచ్చాయి. ప్రజలకు ఇప్పటివరకు పెద్దగా తెలియని లాక్ డౌన్, క్వారంటైన్, ఐసోలేషన్ హోం క్వారంటైన్ లాంటి పదాలు పరిచయమయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నియంత్రణలో భాగంగా ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ల కోసం క్వారంటైన్ స్టాంపులు వేస్తున్నాయి.

స్టాంప్ వేసేందుకు ఇంక్ ను ఉపయోగిస్తున్నాయి. అయితే ఈ ఇంక్ వల్ల స్కిన్ ఇన్‌ఫెక్షన్ సోకుతున్నట్టు తేలింది. దేశంలోని పలు ఎయిర్ పోర్టుల్లో ఇంకులో నాణ్యత లేకపోవడం వల్లో, ఇతర కారణాల వల్లో స్టాంపులు వికటిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే పలువురు ఈ మేరకు ఫిర్యాదు చేశారు. సామాన్యులకే కాదు ప్రముఖులకు కూడా ఇంక్ వల్ల ఇన్‌ఫెక్షన్ సోకడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
కాంగ్రెస్ నేత మధు యాష్కీ కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ దృష్టికి ఇంక్ వల్ల కలిగిన ఇన్ఫెక్షన్ ను తీసుకెళ్లారు. అమెరికా నుంచి ఢిల్లీకి వచ్చిన మధు యాష్కీకి ఎయిర్ పోర్ట్ లో క్వారంటైన్ స్టాంప్ వేశారు. ఆ తరువాత చేతులు మారిపోవడంతో ఆయన కేంద్ర మంత్రికి ఈ విషయం గురించి సమాచారం ఇచ్చారు. తనకు మాత్రమే కాదని ఇతరులకు కూడా ఈ విధంగా ఇంక్ వల్ల ఇన్ఫెక్షన్ సోకుతుందని మధు యాష్కీ చెప్పుకొచ్చారు.
స్టాంప్ ఇంకులో వాడుతున్న కెమికల్స్ ను పరిశీలించాలని సూచనలు చేశారు. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సీఎండీతో ఈ అంశం గురించి.. విషయం తమ దృష్టికి తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు అని కేంద్ర మంత్రి తెలిపారు. అయితే కొందరు నెటిజన్లు చర్మం సెన్సిటివిటీ వల్ల ఇన్ఫెక్షన్ వక్ఛి ఉంటుందని ఇంక్ వల్ల కాదని చెబుతున్నారు.



























