ఈరోజు ఆంతర్జాతీయ బాలికా దినోత్సవం అనే సంగతి మనందరికీ తెలిసిందే. దీంతో అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు
కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినులకు ఉన్నత గౌరవం దక్కేలా చేశారు. జిల్లా కలెక్టర్ పోస్టుతో పాటు 63 మండలాలకు బాలికలనే తహశీల్దార్లుగా నియమించారు. ఒకే ఒక్కడు సినిమాలోలా విద్యార్థినులు ఒక్కరోజు కలెక్టర్, తహశీల్దార్ బాధ్యతలను నిర్వర్తించారు.

కలెక్టర్ గంధం చంద్రుడు లాటరీ పద్ధతి ద్వారా విద్యార్థినులను ఎంపిక చేశారు. జిల్లాలోని గార్లదిన్నె మండలంలో ఇంటర్ చదువుతున్న శ్రావణి అనే అమ్మాయికి లాటరీ ద్వారా ఒక్కరోజు కలెక్టర్ గా పని చేసే సువర్ణావకాశం దక్కింది. కలెక్టర్ గంధం చంద్రుడు జాయింట్ కలెక్టర్ తో కలిసి శ్రావణికి ఈరోజు కలెక్టర్ గా బాధ్యతలను అప్పగించారు. సహస్ర, మధు శ్రీ అనే ఇద్దరు బాలికలు జాయింట్ కలెక్టర్ గా విధులు నిర్వర్తించారు.
ఒక్కరోజు కలెక్టర్ శ్రావణి దిశ చట్టం కింద నమోదైన కేసులోని బాలికకు పరిహారం ఇచ్చే ఫైల్ పై సంతకం చేశారు. జిల్లాలో ఇతర ప్రభుత్వ పదవుల బాధ్యతలను కూడా బాలికలే నిర్వర్తించడం గమనార్హం. కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ బాలికలకు బాధ్యతలను అప్పగించడం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలు బాధ్యత కలిగిన పదవుల్లో ఉంటే వారికి న్యాయం జరుగుతుందని అన్నారు.
ఇలాంటి కార్యక్రమాల వల్ల బాలికల్లో బాధ్యత పెరిగి వారి లక్ష్యాలకు మరింత చేరువ అవుతారని వెల్లడించారు. మహిళా ఉద్యోగులు ఈ తరహా కార్యక్రమాల అమలు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ గంధం చంద్రుడు ఒక్కరోజు కలెక్టర్ గా, తహశీల్దార్లుగా విద్యార్థినులకు అవకాశం ఇవ్వడంపై ప్రజల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.






























