గెలుపు లేని సమరం.. జరుపుతోంది సమయం. ముగించేదెలా రణం.. మధురమైన గాయం.. మరిచిపోదు హృదయం.!! అనే పాట మహానటి సినిమాలో తెరపై కనిపిస్తూ ఉంటే ఎంతటి పాశాన హృదయమైన కన్నీటి పర్యంతం కావాల్సిందే. ఆ మహా నటి జీవితం ఆద్యంతాలు దాదాపు విషాదభరితమైనవనే చెప్పుకోవచ్చు. బాల్యంలో తండ్రి చనిపోవడంతో పెదనాన్న వద్దకు వచ్చి చదువుకొని, నాటకాలు వేస్తూ.. ఆ మక్కువతోనే సినిమా రంగంలోకి అడుగు పెడుతుంది. మామూలు జీవితంలోంచి వచ్చిన సావిత్రికి ఒక్కసారిగా ఆ రంగుల ప్రపంచంలో అందరూ ఆమెలాగే ఉంటారని భ్రమ పడింది. కానీ గోముఖవ్యాఘ్రం లా జెమినీ గణేషన్ ఆమెకు సహాయం చేస్తూ, భార్యాపిల్లలు ఉన్న కూడా సావిత్రి ని ప్రేమిస్తున్నానంటూ నమ్మబలికాడు.

నిజం తెలిసిన సావిత్రి తిరగబడడంతో జెమినీ గణేషన్ చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి నానారకాల అబద్ధాలు ఆడతాడు. గొర్రె కసాయివాడినే నమ్ముతుంది అన్నట్టుగా సావిత్రి, జెమినీ గణేష్ ను నమ్మి వివాహం చేసుకుంటుంది. హెచ్.ఎమ్.రెడ్డి, కేవీ రెడ్డి, బి.యన్.రెడ్డి, బి.నాగిరెడ్డి ఎల్.వి.ప్రసాద్ లాంటి మహామహుల నిర్మాణ, దర్శకత్వంలో నటించే అవకాశం ఆమె పొందడం జరిగింది. అలాగే ఎస్వీ రంగారావు, ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు వంటి వారితో సహచర నటిగా ఆయా సినిమాల్లో నటించి తనను తాను నిరూపించుకుంది. అలా తను సిని ఉచ్చదశలో ఉన్నప్పుడు బావిలో కప్పల్లాగా అందరూ ఆమె చుట్టూ చేరారు. ఆమె ఓ చిత్రానికి స్వీయ దర్శకత్వం చేసి పరాజయాన్ని మూట కట్టుకున్నారు. అలానే భర్త జెమినీ గణేషన్ నుంచి పోరు, అప్పుడే ఆమె కాస్త లావెక్కడం లాంటి కారణాలతో సినిమాలు తగ్గుముఖం పట్టాయి.

ఇలాంటి విషాదభరితమైన సంఘటనలతో మహానటి సినిమా 2018లో రూపుదిద్దుకుంది. అయితే సినిమాలో ఒక అందమైన తప్పు జరిగింది. మహానటి చిత్రంలో… 1979లో వచ్చిన గోరింటాకు చిత్రం షూటింగ్ విరామంలో ఎస్వీ రంగారావు సావిత్రి గారికి భోజనం తినమని కోరతాడు. అప్పుడు సావిత్రిని ఉద్దేశించి కొన్ని మంచి సంభాషణలు ఉంటాయి… ఎస్వీ రంగారావు మాత్రం 1974లో మరణించారు. అయితే ఈ సీన్ కావాలనే నాగ్ అశ్విన్ మహానటి చిత్రంలో పెట్టడం జరిగింది. నిజ జీవితంలో సావిత్రితో గుమ్మడిగారు ఈ సంభాషణలు చెప్పడం జరిగింది. మళ్లీ గుమ్మడి లాంటి పాత్రను సృష్టించి ఆ సంభాషణలు చెప్పించడం ఎందుకని.. ఇదివరకే ఎస్.వి.రంగారావు పాత్ర సినిమాలో ఉండడంతో ఆయనతో ఆ సంభాషణలు చెప్పించడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here