గుండెపోటు అంటే చాలామందికి వెంటనే గుర్తొచ్చేది కొలెస్ట్రాల్, బ్లాక్స్, ఆయిల్ ఫుడ్స్ మాత్రమే. కానీ ఆధునిక వైద్య పరిశోధనలు చెబుతున్న దాని ప్రకారం, గుండె ఆరో్యం కేవలం రక్తనాళాలకే పరిమితం కాదు. మన జీర్ణవ్యవస్థ, ముఖ్యంగా గట్ హెల్త్ కూడా గుండె పనితీరుపై కీలక ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. అంటే గుండె సమస్యల మూలం చాలా సందర్భాల్లో మన పొట్టలోనే మొదలవుతుందన్న మాట.

ప్రస్తుతం మారుతున్న జీవనశైలి, ప్రాసెస్డ్ ఫుడ్స్, నిద్రలేమి, ఒత్తిడి వంటి కారణాలతో జీర్ణవ్యవస్థలోని మంచి బ్యాక్టీరియా సమతుల్యత దెబ్బతింటోంది. దీని వల్ల శరీరంలో నిశ్శబ్దంగా ఇన్‌ఫ్లమేషన్ పెరుగుతుంది. ఈ పరిస్థితి మొదట జీర్ణక్రియపై ప్రభావం చూపినా, కాలక్రమేణా రక్తనాళాలు, గుండె ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
నిపుణుల మాటల్లో చెప్పాలంటే, గుండెపోటు ఒక్కరోజులో వచ్చే సమస్య కాదు. ఏళ్ల తరబడి శరీరంలో పేరుకుపోయే జీవక్రియ లోపాలు, చెడు అలవాట్లు దీనికి కారణమవుతాయి. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్స్, అధిక చక్కెర ఉన్న పదార్థాలు, ఒత్తిడి ఎక్కువగా ఉండే జీవనశైలి గట్‌లోని మంచి సూక్ష్మజీవులను తగ్గిస్తాయి. దాంతో శరీరంలో వాపు పెరిగి, ధమనుల పనితీరు క్రమంగా దెబ్బతింటుంది.
అలాగే సరైన నిద్ర లేకపోవడం, రోజంతా కూర్చునే అలవాటు, వ్యాయామం లేకపోవడం కూడా గుండె సమస్యలకు పరోక్ష కారణాలుగా మారుతున్నాయి. మానసిక ఒత్తిడి ఎక్కువైతే శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని, రక్తపోటు మరియు చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదం ఉంది. ఇవన్నీ కలిసి గుండెపై అదనపు భారం పెడతాయి.
ఆరోగ్య నిపుణులు చెబుతున్న దాని ప్రకారం, గుండెను కాపాడుకోవాలంటే కేవలం కొలెస్ట్రాల్ తగ్గించే మందులపైనే ఆధారపడకూడదు. సహజమైన ఆహారం, ఫైబర్ ఎక్కువగా ఉన్న పదార్థాలు, పెరుగు వంటి ప్రోబయోటిక్స్ తీసుకోవడం చాలా ముఖ్యం. అలాగే ప్రతిరోజూ కొంతసేపు నడక, వ్యాయామం, ధ్యానం వంటి అలవాట్లు గట్ హెల్త్‌ను మెరుగుపరచడంలో సహాయపడతాయి.
శరీరానికి సరిపడా నిద్ర, ఒత్తిడిని తగ్గించే జీవనశైలి, ప్రాసెస్డ్ ఫుడ్స్‌కు దూరంగా ఉండటం ద్వారా గుండె ఆరోగ్యాన్ని చాలా వరకు కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. గుండె ఆరోగ్యం అనేది కేవలం ఒక అవయవానికి సంబంధించిన విషయం కాదు.. మన మొత్తం జీవనశైలికి అద్దం పడే అంశమని వారు గుర్తుచేస్తున్నారు.































