ఉన్నత చదువులు చదవాలని కలలు కన్న ఏ ఒక్క విద్యార్థి కల ఆగిపోకూడదనే ఉద్దేశంతో, వారికి ఉన్నత చదువులు కల్పించాలన్న లక్ష్యంతో రూపకల్పన చేసిన “జగనన్న విద్యా దీవెన” పథకం కింద 2020_21 ఫీజు రీయింబర్స్మెంట్ మొదటి విడత నగదును రాష్ట్ర ప్రభుత్వం నేడు ప్రారంభించింది.వివిధ విద్యా సంస్థలలో ఉన్నత చదువులు చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి పూర్తిగా ఫీజు రీఎంబర్స్మెంట్ జగనన్న విద్యా దీవెన పథకం కింద ప్రతి సంవత్సరం నాలుగు విడతలుగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

ఈ పథకం కింద మొదటి విడతలో సుమారు 10,88,439 మంది విద్యార్థులకు సంబంధించిన రూ.671.45 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను నేరుగా తల్లుల ఖాతాలోకి జమ చేయనున్నారు. ఈ పథకం కోసం ఆర్థిక శాఖతో పాటు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల నుంచి మొత్తం 671.45 కోట్ల నిధులను విడుదల చేస్తూ ఆదివారం జీవో విడుదల చేసింది.
అర్హులైన ప్రతి ఒక్క విద్యార్థికి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు లేకుండా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం లోనే పూర్తిగా తల్లుల ఖాతాలోకి రాష్ట్రప్రభుత్వం జమ చేయనుంది. ఇందులో భాగంగానే 2020 -21 సంవత్సరానికి గాను మొదటి విడత ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఏప్రిల్ 19న తల్లుల ఖాతాలోకి జమ చేశారు. రెండవ విడత జులై నెలలో, మూడవ విడత డిసెంబర్, నాలుగో విడత వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేయనున్నారు.
జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా నేరుగా తల్లుల అకౌంట్ లో డబ్బులు జమ కావడం వల్ల నేరుగా తల్లిదండ్రులు కాలేజీలకు వెళ్లి ఫీజులు చెల్లిస్తారు.అప్పుడు ఆ కాలేజీలో ఉన్న సమస్యలు, వాటిలో ఉన్న సౌకర్యాలు, సదుపాయాలు స్వయంగా తల్లిదండ్రులు తెలుసుకొని ఆ సమస్యల. గురించి యాజమాన్యంతో ప్రశ్నించే అవకాశం ఉంటుంది కనుక ఈ పథకం కింద డబ్బులను నేరుగా కళాశాల యాజమాన్యంకి కాకుండా, తల్లుల అకౌంట్లో జమ చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి భావించారు.