హైదరాబాద్: హరిహర వీరమల్లు విడుదలకు ముందు ప్రేక్షకుల్లో ఉన్న ప్రధానమైన సందేహం, ఈ గ్రాండ్ విజువల్స్‌కు మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఎంతవరకు న్యాయం చేస్తారు అనే అంశం. ఆస్కార్ అవార్డు అందుకున్నట్టే అయినా, కొన్ని సందేహాలు ప్రజల్లో మిగిలిపోయాయి. ఇందుకు కారణం కీరవాణి గత కొన్ని సంవత్సరాలుగా రాజమౌళికి మాత్రమే తన బెస్ట్ మ్యూజిక్ ఇస్తున్నారని వినిపించిన విమర్శలు. హరిహర వీరమల్లు ఆల్బమ్ విషయంలోనూ ఇదే చర్చ జరిగింది. రిలీజ్ అయిన పాటలు ఒకదానికొకటి మించినవి కాకపోయినా, రెండు పాటలు శ్రోతల్లో ఫాస్ట్‌గా చేరాయి. కానీ అవి చార్ట్ బస్టర్స్ కాలేదన్నది నిజం.

‘హరిహర వీరమల్లు’కు కీరవాణి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
అయితే సినిమా విడుదలయ్యాక ఆ అనుమానాలు కొంత మేర పటాపంచలయ్యాయి. థియేటర్లలోని అనుభవం చూస్తే, కీరవాణి అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రాణం పోసినట్టు అనిపించింది. కొన్ని ముఖ్యమైన ఎపిసోడ్స్‌లో మ్యూజిక్ కంటే ఎక్కువగా ఎమోషన్ అందించగలిగిన స్థాయిలో ఆయన పని చేశారు. మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్లలో అభిమానులు ఈ ఎఫెక్ట్‌ను బాగా ఆస్వాదించారు. సన్నివేశాల ఇంటెన్సిటీకి తగినట్లు స్కోర్ ఉండటంతో పాటలు కూడా స్క్రీన్ మీద కనెక్ట్ అయ్యాయి. ఈవెంట్లలో పవన్ కళ్యాణ్, దర్శకుడు జ్యోతికృష్ణ, నిర్మాత ఏఎం రత్నం చెప్పిన అంచనాలకు అనుగుణంగా కీరవాణి పని చేశారని చెప్పొచ్చు. పవన్‌తో తన మొదటి సినిమా అనుభవాన్ని పాజిటివ్‌గా మలిచారు.
తదుపరి మైల్‌స్టోన్స్: విశ్వంభర, మహేష్-రాజమౌళి ప్రాజెక్ట్
ఇప్పుడు కీరవాణి ముందు తదుపరి మైల్‌స్టోన్ విశ్వంభర. ఈ సినిమా మరింత భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. మెగాస్టార్ చిరంజీవితో ఆయన మళ్లీ కలసి పనిచేయడం మరో స్పెషల్ మూమెంట్. గతంలో ఘరానా మొగుడు, ఆపద్బాంధవుడు, ఎస్పీ పరశురాం సినిమాలకు కీరవాణి సంగీతం అందించారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఈ జోడీ రీ-యూనియన్ కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన రామనవమి పాట పర్వాలేదనిపించగా, మరో ప్రత్యేక గీతాన్ని భీమ్స్ చేత కంపోజ్ చేయించారు.
ఇక ఇప్పుడు అందరి దృష్టి విశ్వంభర నేపథ్య సంగీతంపై ఉంది. ఆ తర్వాత మరింత పెద్ద స్కేల్ ప్రాజెక్ట్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న పాన్ ఇండియా మూవీ. కీరవాణికి అది నిజమైన సవాల్‌గా మారబోతోంది. రాజమౌళితో మరోసారి తన ప్రతిభను ప్రూవ్ చేసుకునే అవకాశంగా కూడా చూడొచ్చు.





























