టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ క్రికెట్ మైదానంలో మాత్రమే కాదు… సినిమాల విషయంలో కూడా తన అభిరుచిని స్పష్టంగా చూపిస్తున్నాడు. తాజాగా ఓ ఫన్ ఇంటర్వ్యూలో పాల్గొన్న అభిషేక్ శర్మ, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే తనకు చాలా ఇష్టమని వెల్లడించాడు. ఖాళీ సమయం దొరికితే మహేష్ బాబు సినిమాలు చూస్తుంటానని, ఆయన స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్ తనను ఆకట్టుకుంటాయని చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్న కారణంగా తెలుగు ప్రేక్షకులకు అభిషేక్ శర్మ బాగా దగ్గరయ్యాడు. హైదరాబాద్‌లో ఉన్నప్పుడు తెలుగు సినిమా సంస్కృతి గురించి సహచర ఆటగాళ్లతో చర్చిస్తానని, ముఖ్యంగా మ్యాచ్‌ల సమయంలో సినిమాల టాపిక్ తప్పకుండా వస్తుందని నవ్వుతూ చెప్పాడు. తెలుగు అభిమానుల క్రేజ్ చూస్తే ఆశ్చర్యం వేస్తుందని కూడా అభిషేక్ అన్నాడు.
మహేష్ బాబుతో పాటు, టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా తనను విపరీతంగా ఆకట్టుకుందని అభిషేక్ శర్మ తెలిపాడు. ఆ సినిమాలో అల్లు అర్జున్ చూపించిన మేనరిజమ్స్ తనకు బాగా నచ్చాయని, కొన్ని సందర్భాల్లో మైదానంలో కూడా అవే స్టైల్‌లు అనుకోకుండా వచ్చేస్తాయని సరదాగా వ్యాఖ్యానించాడు. అల్లు అర్జున్ స్క్రీన్ ప్రెజెన్స్, డ్యాన్స్ చాలా ఇష్టమని ఓ ఇంటరాక్షన్‌లో పేర్కొన్నాడు.
అంతేకాదు, ఆర్‌ఆర్‌ఆర్ సినిమాపై కూడా అభిషేక్ శర్మ సోషల్ మీడియా ద్వారా ప్రశంసలు కురిపించాడు. ముఖ్యంగా ‘నాటు నాటు’ పాట తనకు బాగా నచ్చిందని, అందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటన అద్భుతంగా ఉందని కొనియాడాడు. భారతీయ సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం గర్వంగా ఉందని కూడా అన్నాడు.
క్రికెట్ విషయానికి వస్తే, ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో అభిషేక్ శర్మ ఆటతీరు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఒక మ్యాచ్‌లో విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగితే, మరో మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్ కావడం లాంటి ఊగిసలాటలు కనిపిస్తున్నా… ప్రత్యర్థి బౌలర్లకు మాత్రం అతడు పెద్ద సవాలుగా మారాడు. అభిషేక్‌ను త్వరగా ఔట్ చేయగలిగితేనే మ్యాచ్ మనవైపు వస్తుందన్న భావన ప్రత్యర్థి జట్లలో పెరుగుతోందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.
తెలుగు ప్లేయర్లు తిలక్ వర్మ, నితీష్ రెడ్డి సహాయంతో తెలుగు డైలాగ్స్ కూడా నేర్చుకుంటున్నానని అభిషేక్ చెప్పాడు. హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టమని, అవకాశం వస్తే రామోజీ ఫిల్మ్ సిటీలో సినిమా షూటింగ్ చూడాలన్న కోరిక కూడా వ్యక్తం చేశాడు. క్రికెట్‌తో పాటు సినిమాలపై ఇంత ఆసక్తి చూపిస్తున్న అభిషేక్ శర్మ మాటలు ఇప్పుడు తెలుగు అభిమానుల్లో మరింత ఆసక్తిని రేపుతున్నాయి.




























