పిల్లలు తినేది కేవలం ఆకలి తీర్చడానికే కాదు.. వారి భవిష్యత్తు ఆరోగ్యాన్ని కూడా నిర్ణయిస్తుంది. కానీ ఈ రోజుల్లో పీజా, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్, చాక్లెట్లు, కూల్‌డ్రింక్స్ వంటి జంక్‌ఫుడ్ చిన్నారుల డైలీ లైఫ్‌లో భాగమైపోయింది. రుచిగా ఉంటుందని, పిల్లలు ఇష్టపడుతున్నారని చాలామంది తల్లిదండ్రులు కూడా వాటిని తరచుగా ఇస్తున్నారు. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన పరిశోధనలు మాత్రం ఈ అలవాటుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఐర్లాండ్‌కు చెందిన యూనివర్సిటీ కాలేజ్ కార్క్ శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో చిన్న వయసులో అధికంగా జంక్‌ఫుడ్ తీసుకోవడం వల్ల మెదడు పనితీరుపై దీర్ఘకాల ప్రభావం పడుతుందని వెల్లడైంది. ముఖ్యంగా మెదడులో ఆకలి, ఆహారపు అలవాట్లను నియంత్రించే ‘హైపోథాలమస్’ భాగం ప్రభావితమవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఒకసారి ఈ భాగం దెబ్బతింటే, పెద్దయ్యాక కూడా అనారోగ్యకరమైన ఆహారం వైపు ఆకర్షణ తగ్గకపోవచ్చని హెచ్చరిస్తున్నారు.
జంక్‌ఫుడ్‌లో అధికంగా ఉండే చక్కెర, ఉప్పు, చెడు కొవ్వులు శరీర బరువును మాత్రమే కాదు, మెదడు స్పందన విధానాన్నీ మార్చేస్తాయని నిపుణులు అంటున్నారు. పిల్లలు అలాంటి ఆహారాన్ని తరచూ తీసుకుంటే, మెదడు దాన్నే “రివార్డ్ ఫుడ్”గా గుర్తుంచుకుని మళ్లీ మళ్లీ అదే కోరుకునే పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల భవిష్యత్తులో ఊబకాయం, మధుమేహం, హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది.
పిల్లలలో ఏకాగ్రత తగ్గడం, చిరాకు, అలసట, నిద్ర సమస్యలు కూడా అధిక జంక్‌ఫుడ్ వినియోగంతో ముడిపడి ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా స్క్రీన్ ముందు కూర్చొని తినే అలవాటు, ఫాస్ట్‌ఫుడ్‌పై మరింత ఆధారపడేలా చేస్తోందని వారు గుర్తుచేస్తున్నారు. అందుకే చిన్నప్పటి నుంచే ఇంటి వంటలు, పండ్లు, కూరగాయలు, పప్పులు వంటి సహజ ఆహారాన్ని అలవాటు చేయాలని సూచిస్తున్నారు.
అయితే ఇప్పటికే జంక్‌ఫుడ్ అలవాటు ఉన్న పిల్లల్లో కూడా మార్పు తీసుకురావచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రోబయోటిక్స్, ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థలో మంచి బ్యాక్టీరియా పెరిగి, మెదడు ఆరోగ్యానికి సహాయపడుతుందని వివరిస్తున్నారు. అరటిపండ్లు, వెల్లుల్లి, ఉల్లిపాయలు, పెరుగు, ఓట్స్ వంటి ఆహారాలను డైట్‌లో చేర్చడం ఉపయోగకరమని సూచిస్తున్నారు.
పిల్లల ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం తల్లిదండ్రులే మొదటి అడుగు వేయాలి. తాత్కాలిక రుచికంటే, దీర్ఘకాల ఆరోగ్యం ముఖ్యం అనే విషయాన్ని గుర్తుంచుకుని చిన్నారుల్లో మంచి ఆహారపు అలవాట్లు పెంచడం అవసరం. రోజువారీ ఆహారంలో చిన్న మార్పులు చేస్తే, పిల్లల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఎదుగుదల కూడా మెరుగ్గా ఉండే అవకాశం ఉంది.































