బరువు తగ్గాలనుకునే వారు సాధారణంగా గ్రీన్ టీ, బ్లాక్ టీ వంటి పానీయాలవైపు మొగ్గు చూపుతుంటారు. అయితే ఇటీవల హెల్త్ అండ్ ఫిట్‌నెస్ ప్రపంచంలో మరో కొత్త హర్బల్ డ్రింక్ మంచి ఆదరణ పొందుతోంది. అదే ‘బ్లూ టీ’. శంఖుపుష్పం పూలతో తయారయ్యే ఈ టీ సహజమైన నీలి రంగుతో ఆకట్టుకోవడమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలతో కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది.

ఆయుర్వేద నిపుణుల ప్రకారం శంఖుపుష్పంలో ఆంథోసైనిన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది శరీరంలో ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే మెటబాలిజం వేగాన్ని పెంచి శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడంలో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకునే బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించాలనుకునే వారు ఈ టీని తమ డైట్‌లో భాగం చేసుకుంటున్నారు.
బ్లూ టీ రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణలో కూడా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. భోజనం తర్వాత ఈ టీ తీసుకోవడం వల్ల గ్లూకోజ్ శోషణ వేగం తగ్గి షుగర్ లెవల్స్ ఒక్కసారిగా పెరగకుండా ఉండే అవకాశం ఉందని సూచిస్తున్నారు. అందుకే మధుమేహంతో బాధపడేవారిలో కూడా ఈ టీపై ఆసక్తి పెరుగుతోంది.
ఇక శరీరాన్ని డిటాక్స్ చేయడంలో కూడా బ్లూ టీ ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో సహాయపడతాయి. దీని వల్ల కాలేయం, మూత్రపిండాల పనితీరు మెరుగుపడే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
చర్మం, జుట్టు ఆరోగ్యానికి కూడా ఈ టీ ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు. యాంటీ ఏజింగ్ గుణాలు ఉండటంతో చర్మం కాంతివంతంగా కనిపించడంలో సహాయపడుతుందని, తలలో రక్తప్రసరణ మెరుగుపడి జుట్టు రాలడాన్ని తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గించడంలో కూడా బ్లూ టీ సహాయపడుతుందని అంటున్నారు. శరీరాన్ని ప్రశాంతంగా ఉంచే గుణాలు ఉండటంతో రాత్రి నిద్ర నాణ్యత మెరుగుపడే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఈ టీ తయారీ కూడా చాలా సులభం. ఒక కప్పు వేడి నీటిలో నాలుగు నుంచి ఐదు శంఖుపుష్పాలు వేసి కొన్ని నిమిషాలు మూతపెట్టి ఉంచాలి. తర్వాత వడకట్టి తేనె లేదా నిమ్మరసం కలిపి తాగవచ్చు. నిమ్మరసం కలిపిన వెంటనే టీ రంగు నీలం నుంచి ఊదా రంగులోకి మారడం దీని ప్రత్యేకతగా చెప్పుకుంటారు.
అయితే గర్భిణీలు, పాలిచ్చే తల్లులు లేదా దీర్ఘకాలిక వ్యాధులకు మందులు వాడుతున్న వారు ఈ టీని తరచుగా తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.



























